విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ఉక్క పరిశ్రమను కాపాడుకుంటాం అంటూ విశాఖలో జనసైనికులు నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ప్రాంగణం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభకు సిద్దమయ్యారు జనసేన నాయకులు, కార్యకర్తలు. అయితే, ప్రాంగణంను మరొక చోటుకి బదిలీ చేయలంటూ పోలీసులు హుకుం జారీచేశారు.
జనసేన పార్టీ ఉత్తరాంధ్రా ఇంచార్జ్ తమ్మారెడ్డి శివ శంకర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించి తీరతాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎన్ని అవాంతరాలు సృష్టించినా సభ జరిపి తీరతాం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉక్కు ప్రైవేటీకరణకు అనుకూలమా? ప్రతికూలమా స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు ఒక రూల్ , మీకు ఒక రూల్ ??? పెడుతోందన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జరిపి తీరతాం అని జనసేన నేతలు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన విశాఖకు రానున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభకు పవన్ హాజరవుతారని పార్టీ తెలిపింది. 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలకు సంఘీభావం ప్రకటించి, అనంతరం సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్.