(జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)
తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద పాటలే రాశారని అనుకుంటారు కానీ, ఆయన కలం నుండి జాలువారిన పాటలెన్నో తెలుగువారిని పరవశింప చేశాయి.
తెలుగునేలపై విశేషంగా వినిపించే బ్రహ్మంగారి తత్త్వాలలోని “నందామయా గురుడ నందామయా…”, ” మకుటం గ్రహించి, పాటను కట్టి ‘పెద్దమనుషులు’లో పరమానందం పంచారు. “జేబులో బొమ్మా జేజేల బొమ్మా…” అంటూ ‘రాజు-పేద’ కోసం కొసరాజు పదాలు చిలికించారు. ఇక కొసరాజు పేరు తలవగానే అందరి తలపుల్లో మొదటగా మెదిలే పాట ఏదంటే ‘రోజులు మారాయి’లోని “ఏరువాకా సాగారో…రన్నో చిన్నన్నా…” పాటనే. ఈ పాట ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తూనే ఉండడం విశేషం. “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” అని అలుపును మరపించినా, “టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ…” అంటూ వినోదం పంచినా కవిరత్నకే చెల్లింది. “అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటీ… బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా…” అంటూ చిందేయించినా, “నిలువవే వాలు కనులదానా…” అంటూ వయారి హంసనడకల చిన్నదాని వెంట పడి పాటందుకున్నా కొసరాజు కలం బలం ఏ పాటిదో తెలిసిపోతుంది. “అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే…” అంటూ పేకాట పాటలోనూ పలు సెటైర్స్ వేసిన తీరు చూస్తే కొసరాజు బాణీ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక “మామ మామా మామా… ఏమే భామా భామా…” అంటూ ‘మంచిమనసులు’ను విజయతీరం చేర్చడంలోనూ కొసరాజు రచన భలేగా పనిచేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జానపద బాణీల్లో భలేగా పసందు చేసిన పాటలెన్నో ఉన్నాయి.
ఎప్పుడూ జానపద గీతాలే కాదు, “ఏ నిమిషానికి ఏమి జరుగునో…” అంటూ కన్నీరు పెట్టించినా, “కలవారి స్వార్థమూ నిరుపేద దుఃఖము…”అంటూ ఆవేదన కలిగించినా, “జయమ్ము నిశ్చయమ్మురా…భయమ్ము లేదురా…”అంటూ ప్రబోధం పలికించినా వాటిలోనూ కొసరాజు బాణీ కనిపిస్తుంది . ఏది ఏమైనా కడదాకా జనానికి జానపదంలోని రుచిని చూపిస్తూ సాగిన ఘనత కొసరాజు సొంతమయింది. ఆయన నిర్మాతగానూ మారి యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో కవిరత్నా మూవీస్ పతాకంపై ‘విశ్వరూపం’ తెరకెక్కించారు. 1984లో కొసరాజుకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. ఇక జానపదం పేరు వినిపించినంత కాలం కొసరాజు పేరు కూడా మన చెవులకు సోకుతూనే ఉంటుంది. అందుకే ఆయన ‘జానపద కవిసార్వభౌముడు’గా జనం మదిలో నిలిచారు.