సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం తాను పోరాటం చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసని.. దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతోపాటు భీదర్ నుండి వచ్చే ప్రజలకు సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమయం వచ్చిన ప్రతిసారి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సీఎంను కోరానని…నా కూతురుతో కలిసి ట్యాంక్ బ్యాండ్ అంబెడ్కర్ విగ్రహం నుండి అసెంబ్లీకి పాదయాత్ర చేసానని గుర్తు చేశారు.
కేసీఆర్ సభలో నాకు మాట ఇచ్చారు… వెంటనే మెడికల్ కాలేజ్ కు వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఉన్న భూముల్లోనే నిర్మాణం చేయాలన్నారు. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయండి..ఎమ్మెల్యేగా నాకు సీఎంగా కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని జగ్గారెడ్డి కోరారు. శంకుస్థాపనకు వచ్చిన రోజు కేసీఆర్ అనుమతితో భారీ సన్మానం చేస్తానని..దీనికి పార్టీతో సంబంధం లేదు నా వ్యక్తిగతమని వెల్లడించారు. అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కేసీఆర్ ను కలుస్తా కృతజ్ఞతలు చెబుతానని పేర్కొన్నారు. శిలాఫలకంపై నా పేరు లేకున్నా సరే…సంగారెడ్డి కి మెడికల్ కాలేజ్ చాలు అని తెలిపారు.