ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్ బీజీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని స్వయంగా ఓటమి పాలయ్యారు. ఈక్రమంలోనే జనసేనాని కొంత సైలంట్ అయినట్లు కన్పించారు. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైసీపీ సర్కారుపై ఢీ అంటే ఢీ అనేలా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్షం టీడీపీనా లేక జనసేనా పార్టీనా? అన్న చర్చ నడుస్తోంది.జనసేన ఏపీలో రోజురోజుకు తన బలాన్ని పెంచుకుంటూ పోతుందనే అభిప్రాయం కలుగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు ఇటీవలీ నుంచి బలంగా విన్పిస్తున్నాయి. ఈ పొత్తులో బీజేపీ ఉంటుంది? లేదా అన్నది పక్కన పెడితే ఈ రెండు పార్టీలు మాత్రం కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలు బయటికి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన సామాజికవర్గాన్ని అంతా ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారనే టాక్ విన్పిస్తోంది. ఏపీలో బలమైన శక్తిగా ఉన్న కాపులను మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయశక్తిగా ఎదిగే ప్రయత్నం జనసేన చేస్తోంది.
టీడీపీకి తొలి నుంచి మద్దుతుగా నిలిచే కాపు సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టింది. దీంతో టీడీపీ అధికారానికి దూరమైందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. జనసేనకు పోలైన ఓటింగులోనూ ఎక్కువ శాతం ఈ సామాజికవర్గానికి చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాన్ని జనసేన ఓన్ చేసుకోవడం ద్వారా రాజకీయంగా బలపడాలని ఆశిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఈ సామాజికవర్గాన్ని చూపించి మరికొన్ని సీట్లు డిమాండ్ చేసే అవకాశం జనసేనకు ఉండనుంది. ఈ కారణాలన్నింటిని బేరీజు వేసుకొని ఆపార్టీ కాపులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేలా జనసేన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే కాపు రిజర్వేషన్ పై పవన్ కల్యాణ్ గళమెత్తే అవకాశం ఉండనుందని సమాచారం. అలాగే కాపుల కోసం ప్రత్యేక స్కీమ్ వంటి అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. జిల్లాల వారీగా కాపులతో సమావేశాలు నిర్వహించి జనసేన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారట. ప్రస్తుతం జనసేనాని ఫోకస్ అంతా కాపు సామాజికవర్గంపైనే ఉందని తెలుస్తోంది. మరీ పవన్ కల్యాణ్ కాపులను ఏమేరకు తనవైపు తిప్పుకుంటారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!