హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరగుతోంది. ఓ వైపు ప్రచార హోరు ..మరోవైపు నామినేషన్ల పర్వం. నామినేషన్ల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. కొంత కాలంగా ఆమె తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మరి అదే తరపున మళ్లీ ఆయన భార్య నామినేషన్ ఎందుకు వేశారు? అంటే ముందు జాగ్రత్త చర్యగా ఈ పని చేశామంటున్నారు ఆ పార్టీ నేతలు. చాలా మంది నేతలు ఇలాగే తమ భార్యతో నామినేషన్ వేయిస్తుంటారు. ఏ కారణంతో అయినా తన నామినేషన్ రిజక్ట్ అయితే అప్పుడు భార్య అభ్యర్థిగా బరిలో దిగుతుంది. అందుకే జమునతో నామినేషన్ దాఖలు చేయించారు. ఇది ఒక కారణం అయితే మరో కారణం ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ అరెస్టవుతాడనే అనుమానం. అందుకే ముందు జాగ్రత్తగా చర్యగా .మునతో నామినేషన్ వేయించామని పార్టీ వర్గాలు అంటున్నారు. అయితే ఈ తరుణంలో ఈటలను అరెస్టు చేయించే సాహసం చేయకపోవచ్చు.
ఈటల రాజేందర్ తన భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులల యాజమాన్యంలోని పౌల్ట్రీ వ్యాపారం కోసం మెదక్ జిల్లాలోని కొంతమంది రైతుల భూములను ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించారు. మెదక్ జిల్లాలో రైతుల భూములు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎండోమెంట్ భూములను ఆక్రమించాడన్న ఆరోపణల నేపథ్యంలో రాజేందర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రెండు విచారణలకు ఆదేశించింది. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. అనంతరం గత జూన్‌లో బీజేపీ లో చేరారు.
విచారణలో భాగంగా రాజేందర్‌ను అరెస్టు చేసే అవకాశాలను బీజేపీ కొట్టిపారేయట్లేదు. అందుకే ఆయన భార్య జమునతో కూడా నామినేషన్ వేయించారు. 56 ఏళ్ల జమున పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు. విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారామె. ఇదిలావుంటే, నామినేషన్ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలను గమనించవచ్చు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో. భర్త రాజేందర్ కన్నా ఆమెకే ఎక్కువ ఆస్తులు ..ఆదాయం ఉంది. జమున వార్షిక ఆదాయం కోటీ 33 లక్షల 40 వేల 372 రూపాయలు. అదే రాజేందర్ వార్షిక ఆదాయం 30 లక్షల 16 వేల 592 రూపాయలు. అంటే ఆమె ఆదాయంలో నాలుగో వంతు కన్నా తక్కువ.
అఫిడవిట్ ప్రకారం ఆమె 28 కోట్ల 68 లక్షల విలువైన చరాస్తులు కలిగి ఉన్నారు. కానీ ఆమె భర్తకు 6 లక్షల 20 వేల విలువైనచరాస్తులు మాత్రమే ఉన్నాయి. జమున చరాస్తులలో 16లక్షల 44 వేల ఇన్నోవా కారు, 20లక్షల 80వేల హోండా కారు, 12లక్షల 21 వేల ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నాయి. రాజేందర్ పేరు మీద ఎలాంటి వాహనం లేదు. అలాగే ఆమెకు 15 వందల గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ 50 లక్షల వరకు ఉంటుంది. నాలుగు కోట్ల 89 లక్షల విలువైన చరాస్తులు ఆమె పేరు మీద ఉండగా..మూడు కోట్ల 62 లక్షల రూపాయల విలువైన చరాస్తులు రాజేందర్ పేరు మీద ఉన్నాయి.
ఇదిలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికను స్వేచ్చగా ..న్యాయంగా జరిపితే టీఆర్‌ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రగతి భవన్‌లో స్కెచ్ వేస్తుంటే ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు ఇక్కడ వాటిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకటి రెండు రోజుల్లో ఈటల రాజేందర్ నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. హుజూరాబాద్‌లో ముక్కోణ పోటీ తప్పదంటున్నారు పరిశీలకులు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక కాంగ్రెస్ తన అభ్యర్థిగా బాలమూర్ వెంకట్‌ను ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 8. అక్టోబర్ 13 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది. నవంబర్ 5తో ఎన్నిక ప్రక్రియ పరిసమాప్తమవుతుంది.
నిజానికి గత 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్‌కు కంచుకోటగా ఉంది. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఉద్యమ నేతగా నియెజకవర్గ ప్రజల్లో ఆయన పట్ల ఇప్పటికీ అదే అభిమానం ఉంది. అయితే ఇప్పుడు ఇది కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారటంతో అందరూ ఇటు వైపే చూస్తున్నారు. ఈటల రాజేందర్‌ను నాలుగుసార్లు అసెంబ్లీకి పంపించిన హుజూరాబాద్ ఓటర్లు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.