కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆసక్తి నెలకొంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంక్షోభాలను ఎన్నో చూసింది. కామరాజ్-ఇందిర మధ్య తలెత్తిన విబేధాలతో 1969 నవంబర్12న కాంగ్రెస్ నిలువునా చీలింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిందన్న కారణంతో నాడు ఇందిరను బహిష్కరించారు. దాంతో ఆమె కాంగ్రెస్ (R)ను ఏర్పాటు చేశారు. ఐతే సిండికేట్ లీడర్లకు షాకిస్తూ మెజార్టీ AICC సభ్యులు ఇందిర వెంట నడిచారు.
1998లో మరోసారి కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది. సీతారాం కేసరిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి ..ఆ స్థానంలో సోనియా గాంధీని కూర్చోబెట్టింది నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC. ఐతే సోనియా నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన షరద్ పవార్, తారిఖ్ అన్వర్, పిఏ సంగ్మా పార్టీ నుంచి బయటకు వెళ్లి NCPని ఏర్పాటు చేశారు. దీనికి ముందు, రాజీవ్ గాంధీ హయాంలో వీపీ సింగ్ తిరుగుబాటు కూడా అలాంటిదే. కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి జనతాదళ్ ఏర్పాటు చేశాడు. బీజేపీ మద్దతుతో 1989లో ప్రధాని కూడా అయ్యారాయన.
పీవీ నరసింహరావు కూడా పార్టీలో పెద్ద సవాళ్లనే ఎదుర్కొన్నారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టినపుడు మాధవరావు సింధియా తీవ్రంగా వ్యతిరేకించారు. బయటకు వెళ్లి ఎంపీ కాంగ్రెస్ పెట్టుకున్నారు. జీకే మూపనార్ తమిళ మానిళ కాంగ్రెస్, ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్ , షీలా దీక్షిత్ తివారీ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
రావటం… పోవటం కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఉండేదే. అయితే పార్టీ బలంగా ఉన్న రోజుల్లో అది పెద్ద ప్రభావం చూపలేదు . కానీ దేశంలో ప్రాంతీయతత్వం..కుల రాజకీయం బలపడుతూ వస్తున్న కొద్దీ కాంగ్రెస్ బలహీనమైంది. మారుతున్న పరిస్థితులకు ఆనుగునంగా పార్టీ నాయకత్వం తీరు మారలేదు. దాంతో ఎందరో యువనేతలు భవిష్యత్‌ను వెతుక్కుంటూ బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఇప్పుడు బెంగాల్‌ని ఏలుతున్నారు. అలాగే ఏపీలో YSRCP, పుదుచ్చేరిలో NR కాంగ్రెస్ ఇలా ఎన్నో పార్టీలు కాంగ్రెస్ నుంచి పుట్టినవే.
136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి చీలిక అంచున నిలిచింది. G-23 రూపంలో అసమ్మతి పార్టీ అధి నాయకత్వాన్ని సవాలు చేస్తోంది. తాజాగా కపిల్ సిబాల్ సంఘటన సంక్షోభానికి ఆజ్యం పోసింది. సిబాల్ సంఘటనపై చర్య తీసుకోవాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ నాయకత్వం ఈ అంశంపై మౌనం వహిస్తోంది. అసలు చర్య తీసుకునే ఉద్దేశం ఉన్నట్టే లేదు. సిబాల్ వంటి సీనియర్ నేత పట్ల ఇలా జరగటం దారుణమని అసమ్మతి వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయస్థానాలు, పార్లమెంటులో సిబల్ సేవలను వారు పార్టీ కార్యకర్తలకు గుర్తు చేస్తున్నారు. కార్యకర్తలు కావాలని ఉద్దేశపూర్వకంగానే అలా చేశారని సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. మనీష్ తివారీ, వివేక్ తన్‌ఖా సిబల్ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేయగా..షాక్ గురయ్యానంటూ ఆనంద్ శర్మ కామెంట్ చేశారు. సీనియర్లు అవమానిస్తున్నారని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పార్టీ వీడుతున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఆయన పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టే అవకాశం వుంది.
రాహుల్ గాంధీ అనుయాయులు, సంస్కరణ వాదుల మధ్య పంచాయితీ ముదిరింది. సంధి కుదిరే సూచనలు కనింపచట్లేదు. రెండు గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడే వారు కూడా లేరు. సమస్యను పరిష్కరించాల్సిన రాహుల్ గాంధీ ..ఈ మొత్తం సంక్షోభంలో ఒక పార్టీ కావటం విడ్డూరంగా ఉందంటున్నారు అసమ్మతి నేతలు. తన చుట్టూ ఓ కోటరీ నిర్మించుకుని…వారిచ్చే తప్పుడు సలహాలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. సీనియర్లను పక్కనబెట్టం దురదృష్టకరమని.. అది కాంగ్రెస్‌కు మంచిది కాదని పార్టీ నుంచి బయటపడటానికి సిద్దంగా ఉన్న అమరిందర్ సింగ్ గుర్తుచేశారు. కపిల్ సిబల్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీయిజం ప్రదర్శించటాన్ని ఆయన ఖండించారు. పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించటం నచ్చకపోవటమే దానికి కారణమన్నారు అమరిందర్ సింగ్. మరోవైపు, రాహుల్ గాంధీ విమర్శకులకు ఆయన సన్నిహితులు అజయ్ మాకెన్, రందీస్ సింగ్ సూర్జేవాలా గట్టిగా బదులిస్తున్నారు.
సమయం దొరికినప్పుడల్లా నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న G-23 నేతలు..పార్టీని వీడే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు. ఏదేమైనా పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారి మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే పార్టీకి మంచి చేసే అంశాలను లేవనెత్తకుండా ఉండలేమంటున్నారు G-23 నేతలు. పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియట్లేదని కపిల్ సిబాల్ అనటమే తాజా చిచ్చుకు కారణం. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జి -23 అసమ్మతి నేతలు ఏడాది క్రితం పార్టీకి లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు అతీ గతీ లేదు. వారి అసహనానికి ఇది కూడా ఓ కారణం.
పార్టీకీ నూతన జవసత్వాల కోసం దారులు వెతుకుతున్న రాహుల్, ప్రియాంకలకు G-23 తీరు చిరాకు తెప్పిస్తోంది. అందుకే వారిని ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుంది వారి తీరు. సీనియర్ల బెడత తొలగితేనే పార్టీకి పునరుజ్జీవం సాధ్యమని నమ్ముతున్నారు ఈ అన్నా చెల్లెలు. పాత తరం నేతలు తమకు అడ్డుగోడగా మారుతున్నారని వారు బావించి వుండవచ్చు. అందుకే వారి మాటలను లెక్కచేయటం మానేశారు. అరచి అరచి వారే అలసిపోతారన్న దోరణి అనుసరిస్తున్నారు ఈ యువనేతలు.
ఓ వైపు సీనియర్లు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు..మరోవైపు రాహుల్ తన కొత్త టీం నిర్మించుకుంటున్నారు. ఆరెస్సెస్‌ని ఎదుర్కొనే వారు పార్టీలో లేరని..అలాంటి వారు బయట ఉన్నారని రాహుల్ బహిరంగంగానే అంటున్నారు. అలాంటి వారిని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం జీర్ణించుకున్న యువతకు పార్టీ తలుపులు తెరుస్తున్నారు రాహుల్. కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవానీ లెఫ్ట్ నేతలకు పార్టీ స్వాగతం పలకటం రాహుల్ వ్యూహంలో భాగమే. ఈ పరిణమాలు చూస్తుంటే ..యాబై ఏళ్ల క్రితం ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో ఆమె మోహన కుమార్ మంగళం, కేవీ రఘునాధ రెడ్డి వంటి కమ్యూనిస్టు నాయకులను పార్టీలోకి తీసుకుంది. ఆమె నడిచిన వామపక్ష బాటనే రాహుల్ అనుసరిస్తున్నాడని ఆయన మాటలే కాదు..చర్యలను బట్టి అర్థమవుతోంది.
రాహుల్ ఉద్దేశాలు మంచివే కావచ్చు…కానీ పరిస్థితులు కూడా అనుకూలించాలిగా. పైగా నాటి పరిస్థితులకు ..నేటి పరిస్థితికి వ్యత్యాసం ఉంది. నాడు ఇందిర ఓ బలమైన శక్తి. అధికారం ఆమె చేతిలో ఉంది. అందుకే ప్రత్యర్థులను సులభంగా లొంగదీసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బలహీన స్థితిలో ఉంది. యావత్ దేశం మీద కాంగ్రెస్ ముద్ర ఉండవచ్చు..కానీ దాని ప్రభావం ఇప్పుడు అంతగా లేదు. వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఏడేళ్లలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు పార్టీని వీడారు. దాంతో కొత్త జవసత్వాలకోసం ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఏ ప్రయోగమూ పనిచేయలేదని ఇప్పటికే రుజువైంది. క్రమ క్రమంగా ప్రజానీకంలో హస్తం పార్టీ తెరమరుగవుతోంది. బీజేపీ ముక్త్ భారత్ నిజమవుతుందేమో అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. ఎన్నడూ లేనంతగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 19శాతం ఓటు షేర్ మాత్రమే సాధించ గలిగింది. అందుకే ఇప్పుడు పార్టీని పూర్తిగా ప్రక్షాలన చేయాలని బావిస్తున్నారా? మళ్లీ మొదటి నుంచి పార్టీ పునర్నిర్మించే ప్రయత్నమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలసినట్టు రాహుల్ ప్రయోగాలు బెడిసికొడతున్నాయా అనిపిస్తోంది. ఓ వైపు సీనియర్ నేతలు వరసగా పార్టీ వీడుతున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దానికి కారణం అధిష్ఠానం వైఖరే అని సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోందని, ఇక పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదని విమర్శించటం పార్టీలో అలజడికి కారణమైంది.
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని, ఎన్నికలు నిర్వహించాలని సిబాల్‌తో సహా 23 మంది నేతలు అధిష్ఠానానికి లెటర్ రాశారు. తాము చెప్పేది దానిపై కూడా ఆలోచించాలని కపిల్ సిబాల్, గులామ్ నబీ ఆజాద్ వంటి నేతలు సోనియాకు చెబుతున్నారు. అయితే ఆమె ఇప్పుడు వారితో మాట్లాడటమే మానేశారు. ఇది G-23 శిబిరంలో నిరాశను మరింత పెంచింది. అయితే ఈ ఏడాది మేలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన నిరాజనక ఫలితాలను వారు అవకాశంగా తీసుకుని మరోమారు నాయకత్వం మార్పు అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఇప్పడు పంజాబ్ సంక్షోభాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ సన్నిహితులు వారిపై ఎదురుదాడి ప్రారంభించారు.
ఏదేమైనా తక్షణం అసమ్మతిని చల్లార్చటం నాయక్తం కర్తవ్యమని విశ్లేషకులు అంటున్నారు.అలాగే పార్టీని వీడేవారిని ఆపాలి..అలాగే వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ప్రయత్నించాలి. తద్వారా బీజేపీని బీజేపీని ఎదుర్కోగల ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వాలి. రాహుల్ ముందు చేయాల్సిన పని ఇది అన్నది కొందరి వాదన. ఏదేమైనా ఈ పరిస్థితుల్లో.. 2024 నాటికి కాంగ్రెస్ ఏ స్థితిలో ఉంటుంది అన్నది వేచి చూడాల్సిందే!!