మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికను ఈటల రాజేందర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇక్కడ మరోసారి గెలిచి సత్తాచాటాలని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఈటల రాజేందర్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోట. టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి హుజూరాబాద్ లో గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తామని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా వ్యక్తి కంటే పార్టీనే గొప్ప అని ఆయన చెప్పదలుచుకున్నారు. ఈమేరకు అలాంటి సంకేతాలను కేసీఆర్ ఇప్పటికే శ్రేణుల్లోకి పంపించారు. ఈ ఎన్నికను గులాబీ బాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ పోరు తప్పదనే ప్రచారం జరుగుతోంది.
ఈ ఉప ఎన్నికలో ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా బీజేపీ టీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొననుంది. కాంగ్రెస్ పోటీ ఉన్నా అది నామమాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా.. నేనా అన్న రీతిలో పోటీకి దిగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు కార్యకర్తలను మోహరించి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈటల రాజేందర్ కు సానుభూతి పవనాలు అనుకూలంగా మారనుండగా.. టీఆర్ఎస్ కు సంక్షేమ కార్యక్రమాలు ప్లస్ కానున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోపాటు స్థానిక మంత్రులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు ఈటల రాజేందర్ వర్గంగా పేరొందిన నేతలంతా ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన కౌన్సిలర్లు సైతం టీఆర్ఎస్ కండువాలు కప్పుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. దీంతో ఈటల రాజేందర్ శిబిరం క్రమంగా బలహీనంగా మారుతున్నట్లు కన్పిస్తోంది.
హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గతంలో ఐదుగురు కౌన్సిలర్లు గెలిచారు. వీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. ఒక్కొక్కరుగా బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతుండటం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా 20వ వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మరో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ చేరేందుకు మంతనాలు జరుగుతున్నాయి.
వీరితోపాటు ఈటల వెంట ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం క్రమంగా టీఆర్ఎస్ వైపు చూస్తుంది. దీంతో క్రమంగా ఈటల శిబిరం బలహీనంగా మారుతున్నట్లు కన్పిస్తుంది. ఈక్రమంలోనే ఈటల రాజేందర్ సైతం బీజేపీ పెద్దల సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ అగ్రనాయకత్వం హుజూరాబాద్ లో తిష్టవేసి ప్రచారం చేయనుందని సమాచారం. ఏదిఏమైనా ఈటల శిబిరం మాత్రం రోజురోజుకు బలహీన పడుతుండగా గులాబీ శిబిరం మాత్రం క్రమంగా వికసిస్తుంది. దీంతో హుజూరాబాద్ లో ఈటల గెలుపు అంతా ఈజీ కాదనే టాక్ విన్పిస్తుంది.