కరోనా కారణంగా చాలా దేశాల్లో 2020, 2021 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. 2022 నూతన సంవత్సర వేడుకలను ధూమ్ ధామ్‌గా నిర్వహించాలని అనుకున్నా… కుదిరేలా కనిపించడంలేదు. ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఆంక్షలు విధించారు. యూరప్, అమెరికా దేశాల్లో వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇక కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం రోజున కొన్ని రకాల పనులు చేస్తే సంవత్సరం అంతా బాగుంటుందని నమ్ముతుంటారు. ఏయే దేశాల్లో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Read: ఏపీ సీఎం జగన్‌కు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి
కొత్త సంవత్సరం రోజున 12 ద్రాక్షపళ్లు తింటే మంచిదని స్పెయిన్ వాసులు నమ్ముతుంటారు. 1909 నుంచి ఈ సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు పాటిస్తుంటారు. ఇక బ్రెజిల్‌లో సముద్రంలోకి తెల్లని పువ్వులు, నగలు, దువ్వెనలు, లిప్‌స్టిక్ వంటి వాటిని విసిరేస్తుంటారు. వీటిని సముద్ర దేవత యెమాంజ స్వీకరించి తమ కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతుంటారు. డెన్మార్క్‌లో ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి సమయంలో అక్కడి ప్రజలు ఇళ్లలోని పాత స్టీల్ పాత్రలు, స్పూన్‌లను పక్కంట్లోకి విసిరివేస్తుంటారు. ఇంటిముందు ఎన్ని పాత్రలు కనిపిస్తే అంత అదృష్టం అని నమ్ముతారు. థాయ్‌లాండ్‌లో తుపాకులతో గాల్లోకి కాల్చడం చేస్తే, సౌతాఫ్రికాలో ప్రముఖుల దిష్టి బొమ్మలను తగలబెట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. డచ్‌లో గుండ్రటి ఆకారంలో ఉండే ఆహారాన్ని కొత్త సంవత్సరం రోజున తీసుకుంటారు. ఇలా చేయడం వలన కొత్త సంవత్సరంలో అంతా బాగుంటుందని ప్రజలు నమ్ముతుంటారు.