పాశ్చాత్య చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు బాలీవుడ్ అలా. ప్రపంచం దృష్టిలో భారతీయ సినిమా అంటే హిందీ సినిమా. ఐతే, ఇప్పుడు ఆ ముద్ర చెరిగిపోతోంది. అసురన్, జైభీమ్, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్‌పై టాలీవుడ్ పై చేయి సాధిస్తోంది అని చెప్పటానికి ఉదాహరణలు. అసురన్ పలు అంతర్జాతీయ ఆవార్డులు గెలుచుకోగా.. జై భీమ్ భారీ హాలీవుడ్ సినిమాలను తలదన్ని ఇంటర్నెట్ టాపర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ఫ వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే 170 కోట్లు వసూలు చేసిన పుష్ఫ త్వరలో రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది. ఏ రకంగా చూసినా ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదనటానికి ఇది ఒక నిదర్శనం.
ఇప్పుడు, హిందీ సినిమాల కన్నా దక్షిణాది భాషా చిత్రాలనే జనం ఎక్కువగా ఆదరిస్తున్నారని ఇటీవల హిందీలో పెరుగుతున్న రీమేక్‌లే చెబుతున్నాయి. నిజానికి దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అవటం కొత్త కాదు..నాటి ఏక్ దుజే కేలియే నుంచి నిన్నటి బాహుబలి వరకు ఎన్నో సినిమాలను అందుకు ఉదాహరణలు. సల్మాన్ ఖాన్‌ని బాలీవుడ్ భాయిజాన్‌ని చేసింది ఏక్ థా టైగర్, దబాంగ్ కాదు, తెలుగు రీమేక్ “వాంటెడ్”. 2006లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాని పదేళ్ల తరువాత హిందీలో తిరిగి తీశారు. దాదాపు వందకోట్లు రాబట్టింది ఆ సినిమా. అంతేకాదు, సల్మాన్ ఖాన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది.
2006లో రవితేజ నటించిన విక్రమార్కుడు, అక్షయ్ కుమార్ హీరోగా 2012లో రౌడీ రాథోడ్‌గా వచ్చింది. రామ్ నటించిన రెడీ (2008) సల్మాన్ హీరోగా 2011లో అదే పేరుతో రీమేక్ అయింది. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డిని 2019లో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో పునర్నిర్మించారు.
దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ చేయటం కొత్త కాదు. దశాబ్దాలుగా వస్తోంది. ఐతే, ఇప్పుడు ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలో ఓటీటీలు ప్రముఖ స్థానం ఆక్రమించాయి. లివింగ్‌రూంలో కూర్చుని నచ్చిన సినిమా చూడగలుగుతాము. ఏ భాష సినిమా కావాలంటే ఆ భాష సినిమా చూడొచ్చు. అలాగే, దక్షిణాది సినిమాలకు రోజు రోజుకు దేశ వ్యాప్త మార్కెట్ పెరుగుతోంది. దాంతో అక్కడి చెందిన ఫిలింమేకర్స్ ఏక కాలంలో వివిధ భాషలలో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇక ముందు రీమేక్‌ల వేగం తగ్గొచ్చని సినీ పండితులు అంటున్నారు.
ఓటీటీ కల్చర్ విస్తృతమవుతున్న వేళ బాలీవుడ్ రేస్‌లో దక్షిణాది సినిమాలకు భాషా పరమైన అడ్డంకి తొలగిపోతోంది. అల్లు అర్జున్ తాజా హిట్ పుష్ప హిందీ వెర్షన్ మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, బిహార్‌లో మంచి వసూళ్లు సాధిస్తోంది. కాబట్టి, సినిమాలో విషయం ఉంటే జనం ఆదరిస్తారనటానికి ఇదో ఉదాహరణ . దక్షిణాది చిత్రాలు, ముఖ్యంగా తమిళ్, తెలుగు సినిమాలు ఈ విషయంలో హిందీ సినిమాల కన్నా చాలా ముందున్నాయి.
దక్షిణాది దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి సినిమాలు తీస్తారు.అందుకు అనుగుణంగా కథలు సృష్టిస్తారు. అందుకే, ప్రభాస్, మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్,అల్లు అర్జున్ సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అలాగే తమిళంలో రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, అజిత్ నటించిన చిత్రాలకు కూడా దేశ విదేశాల్లోని భారతీయుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.
దక్షిణాది ఫిలిం మేకర్స్ అందరూ మెచ్చే కథాంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్లే అవి చిన్న చిన్న పట్టణాల నుంచి మహానగరాల ప్రేక్షకుల వరకు అందరి ఆదరణ పొందుతున్నాయి. కానీ, బాలీవుడ్ నిర్మాత, దర్శకులు కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసమే సినిమాలు తీస్తున్నట్టు కనిపిస్తోంది. అలా తీయటం తప్పుకాదు..కానీ అదే సమయంలో సామాన్య ప్రేక్షకుల అభిరుచులను విస్మరించకూడదు. చాలా కాలంగా బాలీవుడ్ ఫిలింమేకర్స్ చేస్తున్న పొరపాటు ఇదే.
మరోవైపు, ఓటీటీల పుణ్యమా అని సౌత్ స్టార్లకు దేశం అంతటా గిరాకీ పెరిగింది.పలువురు దక్షిణాది హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ఉంది. పెద్ద మొత్తంలో రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయన సినిమాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ సినిమాకు 150 కోట్లు డిమాండ్ చేసినట్టు టాలీవుడ్ టాక్. ప్రభాస్ చివరి చిత్రం సాహూ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నిర్మాతలను నష్టాల పాలయితే చేయలేదు. ఈ నేపథ్యంలో సౌత్ సినిమా బాలీవుడ్‌ను అధిగమిస్తుందా? అనే ప్రశ్న రాకుండా ఉండదు.
ఇప్పుడు భారతీయ సినిమాలో నవశకం నడుస్తోంది. వంద రోజుల ఫంక్షన్లు ..సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు లేని శకం. నిజానికి సిని పరిశ్రమ వీటికి ఏనాడో దూరమైంది, అది వేరే సంగతి. కానీ..ఇప్పుడు ఓటీటీ తరం భాషా అడ్డుగోడలను కూల్చుతోంది. బాలీవుడ్ సినిమా కావచ్చు..శాండల్‌వుడ్ సినిమా కావచ్చు. సినిమా నచ్చాలి అంతే. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, భోజ్‌పురి..నచ్చిన సినిమాని ఇంట్లో కూర్చుని చూస్తున్నారు. కాబట్టి, ఈ సంధికాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటం సినీ రంగం మీద ఉన్న పెద్ద బాధ్యత. ఓటీటీ సినిమాలకు అలవాటు పడిన వారు థియేటర్‌కు రప్పించాలంటే జనరంజక సినిమాలు ఎక్కువగా రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులకు నచ్చింది ఇవ్వాలి.. లేదంటే దానిని వారు వేరే చోట వెతుక్కుంటారు. ఈ సూత్రాన్ని బాలీవుడ్ ఫిలిం మేకర్లు కూడా తెలుసుకుంటే మంచిది.
నిజానికి దక్షిణ భారతదేశంలోని భాషా చిత్ర పరిశ్రమలకు తమవైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాషా పరంగా..సంస్కృతి..సాంప్రదాయల పరంగా వాటికి గొప్ప చరిత్ర ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ చిత్ర పరిశ్రమలకు నాణ్యతా పరంగానే గాక సంఖ్యా పరంగానూ గొప్ప పేరుంది. కాలంతో పాటు అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. ‘బాహుబలి’ వంటి జానపథ గాథ నుంచి ఎంథిరన్ వంటి ఉన్నత సాంకేతిక విలువలతో కూడిన అనేక సినిమాలు దక్షిణాది నుంచే వచ్చాయి. ‘సూపర్ డీలక్స్’ వంటి థ్రిల్లింగ్ ఎక్సపర్మెంట్లు కూడా దక్షిణాది ఫిలిం మేకర్స్ నుంచి వస్తాయి. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్,’ వంటి సినిమాలు దక్షిణాది సినీ పరిశ్రమకు ఏ ఫార్ములా లేదని నిరూపిస్తున్నాయి.
మరోవైపు, హిందీ పరిశ్రమలో చాలా వరకు సాహసాలు ఉండవు. హీరోలు కూడా వెనకాడతారు. కానీ దక్షిణాదిలో ఈ తరం నటులు నటనా ప్రాధాన్యం కలిగిన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏక కాలంలో హీరోగా .. విలన్‌గా మెప్పిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించటం గొప్ప విషయమే కదా. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘కురుప్’లో క్రిమినల్ పాత్రను పోషించాడు. 37 ఏళ్లుగా కేరళ పోలీసులకు తప్పించుకు తిరుగుతున్న సుకుమార్ కురుప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పాత ఫార్ములానే నమ్ముకుని సినామాలు తీస్తున్నారు. ఫక్త్ ఎంటర్టెయిన్మెంట్ మసాలా కథలే కనక వర్షం కురిపిస్తాయని వారి నమ్మకం. కథా పరంగా…క్రియేటివీ పరంగా దక్షిణాది చిత్రాలు ఏనాడో బాలీవుడ్‌ను దాటేశాయి. ఇప్పుడు అవి హిందీ సినిమాల రేంజ్‌ని మించి బాక్సాఫీస్‌ని కొల్లగొడుతున్నాయి.
తొలినాళ్లలో దక్షిణాది సినిమాలపై సూపర్‌స్టార్ వర్షిప్ అనే ముద్ర ఉండేది. ఐతే, కొన్నేళ్లుగా ఆ ముద్ర క్రమంగా చెరిగిపోతోంది. టీవీ ఛానళ్లు దక్షిణాది సినిమాలకు ఉత్తరాధి భాషలలోకి డబ్ చేసి ప్రసారం చేస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో సబ్‌టైటిల్స్ వేసి చూపించటం కూడా ఈ మార్పుకు ఒక కారణం.
ఇప్పుడు దక్షిణాది సినిమాలు ప్రాంతీయంగానే గాక దేశ విదేశాలలలో భారీ వసూల్లు రాబడుతున్నాయి. ఇది హిందీ పరిశ్రమకు ప్రేరణ ఇస్తోంది. ఏదేమైనా, వేగంగా పెరుగుతున్న ఓటీటీ సంస్కృతి రాబోవు రోజులలో భారతీయ సినిమా స్వరూపాన్నే మార్చనుంది అన్నది మాత్రం నిజం