మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బీజేపీతో కలుస్తారన్న ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తన మద్దతుదారులతో బీజేపీలో చేరేందుకు అజిత్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఎన్సీపీలోనే ఉంటానని ప్రకటించి.. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచరాన్ని అజిత్ పవార్ ఖండించారు. అయినా రాజకీయ వర్గాల్లో మాత్రం దీనికి ఫుల్ స్టాప్ పడలేదు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అప్రమత్తమైంది.
Also Read:Mamata Banerjee: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్
ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహా ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరితే, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో భాగం కాదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న షిండే వర్గం.. అజిత్ పవార్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేరుగా బిజెపితో వెళ్లదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్సీపీ ద్రోహం చేసే పార్టీ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ అన్నారు. అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండమన్నారు. ఎన్సీపీని బీజేపీ తమతో తీసుకెళ్తే మహారాష్ట్రకు నచ్చదని చెప్పారు. తాము కాంగ్రెస్, ఎన్‌సిపితో కలిసి వెళ్లడం ప్రజలు ఇష్టపడనందున ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని అవిభక్త శివసేన నుండి బయటకు వచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎన్‌సిపి (గత మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో భాగమైన)తో ఉండకూడదనుకోవడం వల్లే తాము విడిపోయామన్నారు.
Also Read:Freedom: సౌతిండియాలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని మించింది లేదంటున్న ‘ఫ్రీడం’ చంద్రశేఖర్‌రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
అక్కడ అజిత్ పవార్‌కు స్వేచ్ఛ లేదన్నారు. అందుకే ఆయన ఎన్సీపీని వీడితే స్వాగతిస్తాం అని చెప్పారు. అయితే, అజిత్ పవార్ ఎన్‌సిపి నాయకులతో కలిసి వస్తే తాము ప్రభుత్వంలో ఉండమని శివసేన నాయకుడు స్పష్టం చేశారు. అజిత్ పవార్ అసంతృప్తికి కారణం ఆయన తనయుడు పార్థ్ పవార్ అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోవడమేనని ఆయన అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మావల్ నియోజకవర్గం నుంచి పార్థ్ పవార్ ఓటమి పాలయ్యారు. అయితే, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌తో ఆయన అసంతృప్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాగా,ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధిగా శిర్సత్ ఇటీవల నియమితులయ్యారు.