ఏపీలో ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల కాళ్లు మొక్కడం అలవాటయిపోయింది. ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లను సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు మొక్కి వార్తల్లో నిలిచారు. తాజాగా విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు.
ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి.. ప్రజా ప్రతినిధి కాళ్లు మొక్కుతారా ? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి కాళ్లపై పడిపోవడం యావత్ పాలనా వ్యవస్థకే అవమానకరం. జిల్లా పాలనా యంత్రాంగం అంతా మంత్రి చెప్పుచేతల్లో ఉందనడాన్నిఈ సంఘటన ప్రతిబింబించడం లేదా? ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? దీన్ని ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించాల్సిన అవసరం లేదా? అత్యున్నత పాలనా వ్యవస్థకు చెందిన పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.