ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ పోలింగ్ పోరు ముగిసింది. గెలుపెవరిదినే దానిపై టెన్షన్ నెలకొంది. ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. హుజురాబాద్ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఈటల వైపు మొగ్గు కనిపిస్తోందంటున్నారు. అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను 2023లో జరగబోయే ఎన్నికలకు ప్రయోగంగా భావిస్తున్నారు.
ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచినంత మాత్రాన ఏం కాదని టీఆర్‌ఎస్ నేతలు బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకుముందే తెలంగాణలో ఆర్ఆర్ఆర్ సీన్ కనిపిస్తుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు వున్నారు. రాజాసింగ్, రఘునందన్, ఇప్పుడు రాజేందర్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారనే ఆశాభావంతో వున్నారు. బీజేపీకి అంత సీన్ లేదని, దుబ్బాకలో గెలిచి జబ్బ చరిచిన బీజేపీకి ఏం గతి పట్టిందో నాగార్జున సాగర్‌లో తేలిపోయిందంటున్నారు గులాబీ నేతలు.
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. గ్రేటర్‌లో ఒక్క సారిగా ఎదిగిపోవడంతో బీజేపీకి వచ్చిన ఊపు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ , మినీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో పూర్తిగా చప్పబడిపోయిందనే చెప్పాలి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తిగా విభిన్నం. బీజేపీకి ఎప్పుడూ బలం లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ పడ్డారు. బీజేపీ కమలం గుర్తుని చూసి కాకుండా.. ఈటలను చూసి ఓటర్లు ఓట్లేశారంటున్నారు. దీంతో పోటీ ప్రధానంగా ఈటల-కేసీఆర్ మధ్యే అంటున్నారు.
ఒకవేళ ఈటల ఓటమి పాలయితే… ఈటలకు ఎంత నష్టం జరుగుతుందో.. బీజేపీకి అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్లయితే అన్ని వర్గాల మద్దతు లభించేదని ఇప్పటికే కొంత మంది అంటున్నారు. ఆయన బీజేపీలో చేరడం వల్ల చాలా మంది మద్దతును కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఈటల ఓడిపోతే దాని ప్రభావం బీజేపీపై ఖచ్చితంగా పడుతుంది.
హుజురాబాద్ లో విజయంతో 2023 ఎన్నికల కు వెళ్లాలని బీజేపీ పట్టుదలతో వుంది. హుజురాబాద్ ఫలితం కమలం శ్రేణులకు మరింత జోష్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాదిన తెలంగాణపై జెండా ఎగరేయాలని అటు అమిత్ షా, ఇటు నడ్డా ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా రెండేళ్ళ ముందునుంచే తెలంగాణ బీజేపీపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. దుబ్బాక తర్వాత నాగార్జున సాగర్‌లో ఓడిపోయినా, తిరిగి పుంజుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నికను అవకాశంగా భావిస్తోంది ఆ పార్టీ యంత్రాంగం.
ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుకి హుజురాబాద్ ఒక అగ్నిపరీక్ష. ఇక్కడ ఫలితాన్ని బట్టి ఆయన ఇమేజ్ పెరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం. హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ బలం పెంచుకోవాలని భావిస్తున్నారు రేవంత్. తెలంగాణలో కేసీఆర్‌ను భయపడకుండా ఢీకొట్టే ఒకే ఒక్కరాజకీయ నేతగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది. అది ఆయనను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసేలా చేసింది. రేవంత్‌కి ఇజ్జత్ కా సవాల్ హుజురాబాద్. అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పోరు సాగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా కాలమే అయింది. టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలే అక్కడ గెలుపు బావుటా ఎగరేశాయి. తర్వాత గులాబీ పార్టీ తన సత్తా చాటుతోంది. గెలుపు అనేది పక్కన బెడితే డిపాజిట్లు దక్కి, కనీసం గట్టి పోటీ ఇవ్వగలిగితేనే రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరుగుతుంది.
ఏది ఏమైనా నవంబర్ 2న వెలువడే హుజురాబాద్ ఓటర్ల తీర్పు తెలంగాణ రాజకీయాల్ని మారుస్తుందనడంతో ఎలాంటి డౌట్ లేదు. ఉప ఎన్నిక ఒకటే అయినా.. మూడు పార్టీల నేతల్లో మాత్రం హుజురాబాద్ ఫలితంపై టెన్షన్ వుంది. ఓటరు తీర్పు ఎవరికి షాకిస్తుందో.. ఎవరికి ఊపు నిస్తుందో చూద్దాం.