సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్‌కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు.
Read Also: సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు
వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఆకాశ్‌కుమార్ సరుకులు కొన్నాడు. బిల్లు రూ.602.70 అవ్వడంతో డీ మార్డ్ వాళ్లను.. క్యారీ బ్యాగ్ అడగగా రూ.3.50 ఛార్జీ వసూలు చేశారు. క్యారీ బ్యాగ్‌పై డీమార్ట్ పేరు ముద్రించినా ఛార్జీ వసూలు చేయడంపై బాధితుడు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ నోటీసులు జారీ చేయడంతో డీ మార్ట్ సంస్థ స్పందించింది. సదరు వినియోగదారుడు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని కమిషన్‌కు డీమార్ట్ వివరణ ఇచ్చింది. కస్టమర్లు తెచ్చుకున్న క్యారీబ్యాగ్‌లను అనుమతిస్తున్నట్లు వివరణలో సంస్థ పేర్కొంది. క్యారీ బ్యాగ్ తీసుకోవాలా? వద్దా? అనేది కస్టమర్ల ఇష్టమని స్పష్టం చేసింది. అయితే డీమార్ట్ వాదనను వినియోగదారుల బెంచ్ తోసిపుచ్చింది. అయితే క్యారీబ్యాగ్‌పై లోగో ప్రింట్ చేసినా.. ఇవ్వకపోయినా వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం డీమార్ట్ యాజమాన్యాన్ని ఆదేశించింది.