ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది.
అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది ప్రభుత్వం. 15 మంది విదేశీ ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సీసీఎంబీ కి శాంపిల్స్ పంపారు అధికారులు. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్ వైరస్ ఉన్నట్టు గుర్తించామని, ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్య శాఖ భరోసా కల్పిస్తోంది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడడంతో విదేశాల నుంచి వచ్చినవారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 34కి చేరాయి.