ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేంద్రమే పంట వేయొద్దు, కొనొద్దు అంటుంది అంటూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న పార్టీ మండిపడుతోంది.. ఇలా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులో రైతులు అయోమయంలో పడిపోతున్నారు. తెలంగాణలో ఉన్నట్టుండి పంట పెరగడం ఒక కారణం అయితే.. ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడమే సమస్యకు అసలు కారణంగా మారింది.
Read Also: మీతో కలిసి మేం.. మాకో ఎమ్మెల్సీ ఇవ్వండి.. కేసీఆర్‌కు విజ్ఞప్తి
రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురియడంతో..సాగు విస్తీర్ణం పెరగడం, పుష్కలంగా పంట పడుతోంది.. ఇక, వరి పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.. సాధారణంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్సీఐ కొనుగోలు చేస్తూ వస్తుంది. వరి పండే రాష్ట్రాల నుంచి వాటిని కొనుగోలు చేసి అవసరం ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడం వారి బాధ్యత.. కానీ, ఎఫ్సీఐ దగ్గర ఇప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోవడంతో.. వడ్ల కొనుగోలుకు ముందుకు రావడంలేదు.. వర్షాకాలంలో పండిన పంటను కొనుగోలు చేసినా.. యాసంగిలో పండిన పంటను మాత్రం కొనుగోలు చేయబోమని చెబుతుండడమే సమస్యగా మారిపోయింది.. దానికి కూడా ఓ ప్రధాన కారణం ఉంది.. యాసంగిలో పండే పంటలో నూకలు అధికంగా వస్తుంటాయి.. దీంతో దానిని బాయిల్డ్ చేసి బియ్యంగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ బాయిల్డ్ రైస్‌ను తింటారు.. కానీ, గత యాసంగి నిల్వలే ఇంకా అధికంగా ఉండటంతో ఇప్పుడు యాసంగిలో పండే ధాన్యాన్ని కొనబోమని చెబుతోంది.
అయితే, ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.. వడ్లు, బియ్యం కొనుగోళ్లపై రాజకీయం దుమారమే రేపుతున్నారు.. మాటల తూటాలు పేల్చుతున్నారు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అబ్బో చూసేవారికి, వినేవారికి, రాసేవారికి పనేపనే.. సందట్లో సడేమియాలా ఎందుకోగానీ కొన్ని ముక్కులు నేలకు రాయమంటారు.. కొన్ని తలలు పగలగొట్టుకోవడానికి పోటీలు పడుతున్నాయి. టచ్ చేసి చూడమని ఒకరు ఛాలెంజ్ విసిరితే.. దున్ని చూపిస్తా అని ఇంకొకరు.. ఇది ట్రయలరే… మున్ముందు సినిమా ఉంది అంటూ ఇంకో వైపు హెచ్చరికలు. పోటా పోటీ నిరసనలు, ధర్నాలు.. మైలేజ్ పెంచుకోవడానికి ఎవరి ప్రయత్నం వారిది.. కానీ, రెండు ప్రభుత్వాలు, ఆ రెండు పార్టీల మధ్య అన్నదాత నలిగిపోతున్నాడు అనేది సత్యం.. బియ్యం కొంటారా? కొనరా? కేంద్రం కొంటుందా? కొనదా? అని రాష్ట్రం నిలదీసినా.. రాష్ట్రం కొంటుందా? కొనదా? కేంద్రం ప్రశ్నించినా.. అసలు కొంటారా? లేదా? అనేది పెద్ద సమస్య.. కానీ, ఎవరూ కొనరు అన్నది ఎవరూ చెప్పని సమాధానం.. ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకోవడానికి పేరుకుపోతున్న వడ్ల మూటలు పనికి వస్తున్నాయి. వడ్లు మాత్రం రోడ్లమీద, మార్కెట్ యార్డుల్లో దిక్కులు చూస్తున్నాయి.. అన్నదాత ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. మాతో మీ రాజకీయం మాని.. కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.