ఈమధ్యకాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సాధారణం అయిపోయాయి. తాజాగా తమిళనాడులోని వెల్లూరు భూప్రకంపనలతో వణికింది.ఐదు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూకంప ప్రభావంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.గుడియాతమ్ప్రాంతంలో భూమి కంపించింది. నెల రోజుల వ్యవధిలోనే భూకంపం రావడం ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు.
వెల్లూరులో గత నవంబర్ 29న భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైంది. అలాగే రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో రెండురోజుల క్రితం డిసెంబర్ 23న మరోసారి భూమి కంపించింది. జిల్లాలో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే వున్న కర్నాటకలోనూ భూకంప ఘటనలు చోటుచేసుకున్నాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో డిసెంబర్ 23న భూకంపం సంభవించింది.
కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో డిసెంబర్ 22న ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. వరుసగా భూకంపాలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే అధికారులు మాత్రం భయపడాల్సింది ఏం లేదంటున్నారు.