2021 ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కోవిడ్ సమయంలో ప్రజలతో పాటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేశారన్నారు. తెలంగాణలో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కుదిరిందని,
ఈ సంవత్సరం మొత్తం ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని ఆయన అన్నారు. మావోయిస్ట్ సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సక్సెస్ అయ్యిందని, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క భైంసాలో మినహా.. ఎక్కడా మతపరమైన వివాదాలు తలెత్తలేదని ఆయన వెల్లడించారు. క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 4.5 శాతం పెరిగాయన్నారు. నేరస్థులకు శిక్షలు పడేలా పోలీస్ శాఖ పనితీరు, పోలీస్ స్టేషన్ లలోని కోర్టు అధికారుల పని తీరుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో పేద, ధనిక అన్న తేడా లేకుండా పోలీస్ శాఖ అందరికీ అందుబాటులో వుంది. ఆపదలో వుంటే పోలీస్ లు ఆదుకుంటారు అని సామాన్యుడికి భరోసా ఇవ్వగలిగాము. ఈ సంవత్సరం షీటీమ్స్ సమర్థంగా పని చేసి 5,145 మంది మహిళా బాధితులకు న్యాయం చేసామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 877 కోట్లు చాలాన్ లు విధించామని, ఈ సంవత్సరం 664 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసామని స్పష్టం చేశారు.