ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల హోంమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌కి బదులు హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు.
ఇదిలా వుంటే.. తిరుపతి కౌన్సిల్ సమావేశంపై తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దక్షిణ భారతదేశ కౌన్సిల్ సమావేశం నిష్ప్రయోజనం అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రం ఇలాంటి సమావేశాలు పెట్టడంతో ఔచిత్యం ఏమిటన్నారు నారాయణ. దక్షిణ భారతదేశంలో పాగా కోసం పాకులాట తప్ప మరేం లేదు. సౌత్ ఇండియా కౌన్సిల్ సమావేశం దర్శనాలకే పరిమితం. రాష్ట్రాల హక్కులు హరిస్తున్న కేంద్రం వల్ల ఒరిగేదేం లేదన్నారు.
జిఎస్టి, విద్యుత్ సంస్కరణలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం ఎందుకు గుర్తించడం లేదన్నారు. ఏపీ తెలంగాణ మంత్రులు ఒకరినొకరు బిచ్చగాళ్ళ ని విమర్శించుకోవడం సిగ్గుచేటు. అమిత్ షా పర్యటన ముగిసే వరకు ప్రతిపక్షాలు బయటకు రాకూడదు అని హుకుం జారీ చేయడం నిరంకుశత్వం అన్నారు. ఆర్టికల్ 21 నీ హరించి వేస్తోందన్నారు. అమిత్ షా పర్యటన వేళ నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామన్నారు నారాయణ. కేంద్రం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏమైందన్నారు?