గోవును తల్లిగా భావిస్తాం. గోవుల సంరక్షణకు ఖర్చుపెడుతున్నా.. కొన్ని గోవులు మాత్రం దాణా లేక తిరిగి రాని లోకాలకు చేరిపోతున్నాయి. విశాఖపట్నంలోని రామానంద ఆశ్రమంలో గోవుల బాధ అంతా ఇంతా కాదు. గో మరణాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 4 గోవులు మృతిచెందాయి. దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి గోవులు.
రామానంద ఆశ్రమంలో ఆకలితో అల్లాడుతున్నాయి 160కి పైగా గోవులు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తోన్న 160 గోవులను పట్టుకుని రామానంద ఆశ్రమంలో వదిలేసి చేతులు దులుపుకున్నారు ఆనందపురం పోలీస్ లు. ఆశ్రమం లో దాణా లేక నిన్న 13 గోవులు మృతిచెందాయి. తాజాగా మరో 4గోవులు మరణించడంతో విషాదం నెలకొంది.
ఇంత జరుగుతున్నా అందుబాటులో లేరు రామానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులు. ఆశ్రమంలోని గోశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దేవాదాయ శాఖ కు కోర్ట్ ఆదేశాలిచ్చింది. దీంతో దేవాదాయ శాఖ వారు కూడా మిన్నకుండిపోయారు. గోమరణాలు చూడలేక దేవాదాయ శాఖ అధికారులు కొంత దాణా తెప్పించినా అది సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి. గోమరణాలు చోటు చేసుకుంటున్నా చోద్యం చూస్తున్నారు ఉన్నతాధికారులు.