తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం బాగా ఎక్కువగా వుంది. సంక్రాంతి కోసం ఇప్పటికే చాలామంది తమ ఊళ్లకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ వస్తే కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ప్రభావంతో తెలంగాణలో విద్యా సంస్థలపై ఆ ప్రభావం మరోసారి గట్టిగా పడేలా ఉంది. కేసులు భారీగా పెరుగుతున్న వేళ, మరోసారి పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదముంది. దీంతో సంక్రాంతి సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈనెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించనున్నాయి విద్యాసంస్థలు.
పాఠశాలలు తిరిగి తెరిచే అంశంపై తర్జన భర్జన పడిన తెలంగాణ సర్కారు ఈనెలాఖరు వరకూ సెలవులు పొడిగించింది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారులు ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించారు. ఇటు జెఎన్టీయూ అధికారులు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. యూజీ, పీజీ కోర్సులైన బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే, ఫార్మ్ డీ, ఫార్మ్ డీ పీబీ, విద్యార్ధులకు ఈ నెల 22 వరకూ ఆన్ లైన్ తరగతులు నిర్వహించనున్నారు.