సంగారెడ్డి జిల్లాపై కరోనా పడగ విప్పిందా? చిన్నపాటి నిర్లక్ష్యం విద్యార్ధులు, విద్యార్ధినుల పాలిట శాపంగా మారిందా? గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు అంత సేఫ్ కాదా? అంటే అవుననే అంటున్నారు. హైదరాబాద్‌ను ఆనుకుని వున్న సంగారెడ్డి జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా ఇంద్రేశంలో కేసులు బయటపడడం ఆందోళనకరంగా మారింది.తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది.
READ ALSO కరోనా సోకిన బాలికల్లో 25 మందికి అస్వస్థత
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. గురుకుల బాలికల పాఠశాలలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మందికి విద్యార్ధినిలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధినులు ఆందోళనకు గురవుతున్నారు. గత వారమే ముత్తంగిలోని గురుకుల పాఠశాలలో కరోనా కలవరం కలిగించిన సంగతి తెలిసిందే. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవల పటాన్‌చెరు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేపింది. ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనా సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినీలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.