తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించాలి, నిబంధనలు, కోవిడ్ ప్రోటోకాల్ వంటి అంశాలపై తలసానితో చర్చిస్తున్నారు సినీ ప్రముఖులు.
మరో వైపు తెలంగాణలోని థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. తెలంగాణలోని సినిమా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల సందర్భంగా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ధరలు పెంచాలని కోరుతూ థియేటర్లు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కో టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, కేసీఆర్ సర్కారు దీనికి స్పందించలేదు. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. థియేటర్ యజమానుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలు పెరిగే అవకాశం వుంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.