చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం మునిసిపల్ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జరుగుతుండడంతో అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ నేతల అరెస్టులు అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి. కుటుంబంలో స్థానికేతరులు తిష్టవేసి ఉన్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.
ఉదయం నుంచి రెండుసార్లు పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో పరిస్థితిపై ఆరా తీశారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని ధైర్యంగా అడ్డుకోవాలన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఫోన్లో పార్టీ నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. ఏ క్షణం అయినా తాను కుప్పం రావడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీ నేతలకు చెప్పారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో పట్టణంలో మొత్తం 25 వార్డులు వుండగా..14వ వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 87 మంది బరిలో ఉన్నారు.
300 పోలింగ్ సిబ్బంది వుండగా..మొత్తం ఓటర్లు 39,259 మంది వున్నారు. పురుష ఓటర్లు 19,342 కాగా, స్త్రీ ఓటర్లు 19,905. మహిళా ఓటర్లే ఇక్కడ ఎక్కువగా వున్నారు. 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 600 మంది పోలీసులు విధుల్లో వున్నారు. 9 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. బ్యాలెట్ పద్దతిలో జరగనుంది పోలింగ్. 20వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కుప్పం నియోజకవర్గ ఇంచార్జి భరత్.