వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని కీలక వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా రెక్కీ వివరాలను ఆరా తీశారు చంద్రబాబు. రాధా భద్రతకు గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే వాటిని తిరస్కరించారు రాధా.
తాజాగా చంద్రబాబు -రాధా ఇంటికి వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడలో క్లబ్ దగ్గర ఉన్న వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు చంద్రబాబు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఇటీవల డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. రెక్కీ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధకు సూచించారు చంద్రబాబు. భద్రత విషయంలో అశ్రద్ద వద్దన్న చంద్రబాబు.. పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామన్నారు చంద్రబాబు. రెక్కీ జరిగిందని రాధ చెప్పారు. ఏడు రోజులు అవుతుంది. నేను డీజీపీ కి లేఖ రాశాను. సీసీ కెమెరాల ఆధారంగా దోషులు ఎవరో పట్టుకునే అవకాశం ఉంది. పోలీసులు ఇంత వరకు ఏమీ చెప్పలేదు. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు? మీ దగ్గర ఆధారాలు ఏమి ఉన్నాయి.. కొంత ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఆ దిశగా ప్రయత్నం చేయలేదన్నారు చంద్రబాబు.
ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవాలి. దోషులు ఎవరో తేల్చాలి. విచారణ పూర్తి చేయాలి..మీ దగ్గర ఆధారాలు బయట పెట్టాలన్నారు చంద్రబాబు. ఆధారాల్లో వున్న నిందితులను కస్టడీ లోకి తీసుకొని విచారించాలన్నారు. తాను లేఖ రాశానని, దాని ఆధారంగా దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఫిర్యాదు అవసరం లేదన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. రెక్కీ చేసిన మాట వాస్తవం.. సీసీ కెమెరాల్లో విజువల్స్ ఉన్నాయా.. లేదా? ఎందుకు కాలయాపన చేస్తున్నారు. రెక్కీ చేసినోళ్లని కనిపెట్టకుండా.. దోషులను కాపాడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వంగ వీటి రాధా రక్షణకు గన్ మెన్లు ఇచ్చి… చేతులు దులుపుకుందాం అనుకున్నారని చంద్రబాబు విమర్శించారు.