మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని కిషన్ రెడ్డి అన్నారు. 1980లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తాను రెగ్యులర్‌గా శాసనమండలిలో రోశయ్య ప్రసంగాలు వీక్షించే వాడినని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో కలిసి పనిచేశామని, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేవాళ్లమని, తాము రాజకీయ శతృవులము కాదని, తమకు రాజకీయ వైరుధ్యము మాత్రమే ఉందని తెలిపారు. వైఎస్‌కు రోశయ్య కవచంగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ దగ్గరకు రోశయ్య తీసుకువెళ్లేవారని, రోశయ్యలేని లోటు తనకు వ్యక్తిగతంగా తీరనిదని కిషన్ రెడ్డి తెలిపారు.