ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం బీఎస్‌ఎన్ ఎల్ మాత్రం తన ఛార్జీల్లో మార్పులు చేయలేదు.
ఎయిర్ టెల్ రూ. 179 జియో రూ.155 వీఐ రూ.179 బీఎస్ఎన్‌ఎల్ రూ 147 ద్వారా ఒకే రకం ప్రయోజనాలు వినియోగదారులకు అందుతున్నాయి. అయితే విజేతగా బీఎస్‌ఎన్ఎల్ నిలుస్తోంది. ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్, అమెజాన్ ప్రైం మొబైల్ ఎడిషన్ సదుపాయం కల్పిస్తోంది. జియో కూడా ఇదే రకం ప్రయోజనాలతో పాటు అమెజాన్ ప్రైంకి బదులు జియో యాప్స్ సూట్ అందిస్తోంది. వీఐ కూడా ఇవే ప్రయోజనాలకు తోడు వీఐ మూవీస్ అండ్ టీవీ అందుబాటులోకి తెచ్చింది. వీటికి ధీటుగా దేశీయ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ మాత్రం 2 జీబీ కాకుండా 10 జీబీ డేటా అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాల్స్ మాత్రమే అందిస్తూ అమెజాన్ లాంటి ప్రయోజనాలు అందించడంలేదు. డేటా పరంగా చూస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ బాగుందంటున్నారు వినియోగదారులు.
అదే ఎయిర్ టెల్ రూ.265, జియో రూ.179, వీఐ రూ.269 ప్లాన్‌లతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రూ.149 ప్లాన్ అందిస్తోంది. ఎయిర్ టెల్, జియో, వీఐ సంస్థలు రోజుకి 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ ఈ సంస్థల కంటే చౌకగా ఒక జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.
అదే ఎయిర్ టెల్ రూ.359, జియో రూ.299, వీఐ రూ.359 ప్లాన్‌లతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రూ.187కే ప్లాన్ అందిస్తోంది. ఎయిర్ టెల్, జియో, వీఐ సంస్థలు రోజుకి 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ ఈ సంస్థల కంటే చౌకగా రోజుకి రెండు జీబీల డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ కేవలం 187కి అందిస్తోంది.
అదే ఎయిర్ టెల్ రూ.599, జియో రూ.601, వీఐ రూ.501 ప్లాన్‌లతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ రూ.997 (నెలకు రూ.166) ప్లాన్ అందిస్తోంది. ఎయిర్ టెల్, జియో, వీఐ సంస్థలు రోజుకి 3 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తున్నాయి. బీఎస్ఎన్‌ఎల్ సంస్థ రోజుకి 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. వీటిలో వీఐ ప్లాన్ బాగుందని వినియోగదారులు అంటున్నారు. మొత్తం మీద ప్రైవేట్ సంస్థల కంటే బీఎస్‌ఎన్‌ఎల్ ధరలు చాలా చౌకగా వున్నాయి. అయితే, నెట్ వర్క్ సమస్య కారణంగా బీఎస్‌ఎన్ఎల్ సంస్థను వినియోగదారులు అంతగా నమ్మడం లేదు. ప్రైవేట్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.