కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మార్చరీలోకి పాత మార్చరీ సామాగ్రిని తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Read: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…
ఈ సమయంలో మార్చరీలోని ఫ్రీజింగ్ బాక్స్‌లో రెండు శవాలు కనిపించాయి. జులై 2020లో కరోనాతో మృతిచెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. కొన్ని కారణాల వలన ఈ రెండు శవాలను అప్పటి నుంచి ఖననం చేయకుండా అలానే వదిలేయడంతో అవి గుర్తుపట్టలేనంతగా కుళ్లిన స్థితికి చేరుకున్నాయి. మార్చరీ ప్రాంతం మొత్తం కుళ్లిన వాసనతో నిండిపోయింది. రాజాజీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్ కర్ణాటక లేబర్ మంత్రి శివరామ్ హెబ్బార్‌కు లేఖ రాశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.