గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజీనామాల పర్వానికి తెరలేచింది. పార్టీ పదవుల పంపకం, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై అసంతృప్తి నేతల్ని పార్టీ వీడేలా చేసింది. ప్రియాంకా గాంధీ పర్యటన సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వరుసగా పదేళ్ల UPA పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ మసకబారిపోయింది. క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతోంది. అయితే, పార్టీకి మళ్లీ జవసత్వాలు ఊదడానికి ప్రయత్నిస్తున్నారు ప్రియాంక గాంధీ. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగుర వేసేందుకు ఏం చేయాలనే దానిపై పార్టీ నేతలతో వరుస భేటీలకు ప్లాన్ చేశారు ప్రియాంక. కానీ, ఆమెకు ఊహించని షాకిచ్చారు గోవా కాంగ్రెస్ నాయకులు.
వరుసగా రాజీనామాలు చేయడంతో పాటు పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భావసారూప్యత గల పార్టీలో కలిసి పోటీ చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. కానీ… ఇది కాంగ్రెస్ నేతల్ని గందరగోళంలోకి నెట్టింది. గోవా ఫార్వర్డ్ పార్టీతో చేసుకున్న అవగాహనపైనా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఈ క్రమంలో పోర్వోరిమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. కర్టోరిమ్ నియోజక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అలీక్పో రెజినాల్డోతో పాటు సౌత్ గోవాకు చెందిన సీనియర్ నాయకుడు మొరెనో రెబెలో కూడా పార్టీకి రాజీనామా చేశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్ పట్టుదలగా లేదని వ్యాఖ్యానించారు పార్టీకి రాజీనామా చేసిన నాయకులు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. పార్టీలో ఉండలేకే విడిచిపెట్టి వెళ్తున్నట్టు స్పష్టం కాంగ్రెస్ చేశారు. మొత్తానికి ప్రియాంక గోవా టూర్ సమయంలో పార్టీకి పలువురు పలువురు నేతలు రాజీనామా చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.