తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో కేసీఆర్ చూపించాలని సవాల్ విసిరారు. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లెటర్ రాసిందని.. ఆ లెటర్ కేసీఆర్‌కు అందిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందని ఆశించామని.. కానీ అది జరగలేదన్నారు. దేశంలో పెట్రోల్‌పై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని బండి సంజయ్ వెల్లడించారు. రాజస్థాన్ తర్వాత అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. పెట్రోల్ ధరలపై వ్యాట్ రూపంలో రాష్ట్రానికి రూ.28, కేంద్రానికి రూ.20 వస్తాయని.. మళ్లీ కేంద్రం తనకు వచ్చే రూ.20లో రూ.12ను మళ్లీ తిరిగి రాష్ట్రానికి ఇస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.