టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఈనెల 14న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించడం షురూ అయ్యింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రిజ్వాన్ (67), బాబర్ ఆజమ్ (39), జమాన్ (55 నాటౌట్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. జంపా, కమిన్స్ చెరో వికెట్ సాధించారు.
Read Also: మరో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్
అనంతరం 177 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫించ్ డకౌటయ్యాడు. వార్నర్ (49), మిచెల్ మార్ష్ (28) దూకుడుగా ఆడటంతో ఆసీస్ 6 ఓవర్లలో 52 పరుగులు చేసింది. కానీ పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ విజృంభించి మార్ష్, స్మిత్ (5) వికెట్లు తీయడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. మ్యాక్స్ వెల్ (7), వార్నర్ కూడా వారిని అనుసరించడంతో 16 ఓవర్లకు ఆసీస్ 127/5తో కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో స్టాయినీస్ (40 నాటౌట్), మాథ్యూ వేడ్ (41 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ చేశారు. షహీన్ షా అఫ్రిది వేసిన 19వ ఓవర్‌లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేడ్‌కు లభించింది.