NTV Telugu Site icon

వంగ‌వీటి రాధాకు సెక్యూరిటీ పెంపు.. సీఎం జ‌గ‌న్ కీలక ఆదేశాలు..

వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారని మీడియాకు తెలిపారు మంత్రి కొడాలి నాని..

వంగవీటి రాధా తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని నా దృష్టికి తీసుకు వచ్చారని తెలిపిన మంత్రి కొడాలి నాని.. నేను ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాను.. ఇంటలిజెన్స్‌ డీజీని సీఎం అలెర్ట్ చేశారు.. రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్ భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. సీఎం జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారని.. ఆధారాలు సేకరించమని, వాటి సంబంధించిన నివేదిక ఇవ్వమని పోలీస్ అధికారులకు సీఎం ఆదేశించారని మీడియాకు వెల్లడించారు.. ఇక, రాధా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి కొడాలి నాని.. రాధాకు రాజకీయంగా ఓనమాలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు.. వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు అయ్యాను.. కానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో.. రాధా చేరికపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు కొడాలి నాని. కాగా, ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతుండగా.. తాజాగా ఆయన సంచనల వ్యాఖ్యలు చేయడం.. వెంటనే ప్రభుత్వం భద్రత పెంచడం ఆసక్తికరంగా మారింది.