ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు.తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు.
తెలుగు సినిమా చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరుకానున్నారు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని.
సిరివెన్నెల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకులు వివి.వినాయక్. “సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్ప వరం. ఆయన లేకపోవడం ఏమిటి? అనిపిస్తోంది. ఎస్పీ బాలుగారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా… ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు కూడా అంతే! ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతారు. నేను దర్శకత్వ శాఖలో పని చేసినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించేవారు. ‘చెన్నకేశవరెడ్డి’లో ఆయనతో పాటలు రాయించుకున్నాను. నా ‘అదుర్స్’ సినిమాలో కామెడీని ఆయన ఎంజాయ్ చేసేవారు. ఆయనతో గడిపిన క్షణాలను ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాను” అన్నారు వివి.వినాయక్.