ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ వైద్యసేవలను విస్తృతం చేయడంలో భాగంగా కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ , ఆర్‌ఈఐటీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)ల చొరవతో 100 పడకల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకొని క్రిటికల్ కేర్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి, తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రూ.150 కోట్లతో 900 ఐసియు పడకలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రోజూ 3.5 లక్షల నుండి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని. వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరుతున్నానని ఆయన అన్నారు.