కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక, ఈ మార్క్‌ను ప్రత్యేకతను ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లనే చేస్తోంది.. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద, నార్త్, సౌత్ బ్లాక్‌లలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, విమానాల లోపల, ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లతోపాటు రైళ్లలో, ఓడల్లో, బస్టాండ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌లో సాధించిన ఘనతపై ప్రకటనలు చేయనుంది ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం నుంచి సందేశం వెల్లింది. కాగా.. ఇవాళ్టితో సుమారు 97 కోట్ల డోసులను ప్రజలకు పంపిణీ చేశారు..