కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం దేశవ్యాప్తంగా శోకసంద్రాన్ని మిగిల్చింది. కేవలం 46 ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడం మిస్టరీగా మారింది. 2021లో తీవ్ర విషాదం నింపిన ఘటనల్లో పునీత్ రాజ్‌కుమార్ మరణం కూడా ఒకటి. పునీత్ ఇక లేరన్న విషయాన్ని అభిమానులే కాదు మీడియాలో న్యూస్ చదివేవాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ న్యూస్ ఛానల్‌లో పునీత్ మరణవార్త గురించి చదువుతూ ఓ న్యూస్ రీడర్ ఎమోషనల్ అయిపోయింది. ఈ వార్త చదివే సమయంలో ఆమె తట్టుకోలేక లైవ్‌లోనే ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. అనంతరం సిబ్బంది ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా పునీత్ రాజ్‌కుమార్ నటిస్తున్న సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆయా సినిమాల పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఆయన పార్ధివ దేహానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, జూ.ఎన్టీఆర్, శ్రీకాంత్, రానా ఉన్నారు. ఆదివారం నాడు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.