తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల పర్యటనలతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో చలి చంపేస్తుంటే.. నేతలు వరి చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ బాద్ షా అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కేసీఆర్ ట్రాప్ లో పడకండని హితవు పలికారు హోం మంత్రి అమిత్ షా.
ఈ సందర్భంగా కేసీఆర్‌తో పోరాటం చేసి ఉప పోరులో విజయం సాధించిన ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌ని అభినందించారు అమిత్ షా. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలకు అమిత్‌షా కార్యాచరణ సూచించారు. రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని అమిత్ షా సూచించారు.
హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏం చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇవ్వడంతో రానున్న రోజుల్లో కమల దళం మంచి జోష్ మీద గులాబీ నేతలపై పోరాటం చేస్తుందని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అసలు వాస్తవాలను కేంద్రం బీజేపీ నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు కేంద్రంపై దుష్ప్రచారం మానుకోవాలని కౌంటర్లు వేస్తున్నారు.
బీజేపీపై చావు డప్పు మోగించాలని కేసీఆర్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల హస్తిన టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాను కలిసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు వున్నారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలకు వ్యూహాత్మక ఎత్తుగడను సూచించారు అమిత్ షా.
తెలంగాణలో బీజేపీని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు, రాబోయే ఎన్నికలకు బీజేపీ క్యాడర్‌ని సమాయత్తం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర తరహాలో ఇతర కార్యక్రమాలు చేపట్టాలని అమిత్ షా సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్ షా ప్రత్యేకంగా 15 నిమిషాలు మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటిస్తానని అమిత్ షా చెప్పారు. రెండు రోజుల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో అమిత్ షా పర్యటనకు సంబంధించి బీజేపీ నేతలు వ్యూహరచనలో వున్నారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీ నేతల పర్యటన హీట్ పెంచిందనే చెప్పాలి.