హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటించారని… తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని వివరించాడు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, బాలయ్య గారి సినిమాలు చూస్తూ పెరిగానని బన్నీ పేర్కొన్నాడు. అలాంటి తాను ఈరోజు బాలయ్య గారి ఫంక్షన్‌కు రావడం స్వీట్ మెమరీ అని అభిప్రాయపడ్డాడు.
వయసులో కాకపోయినా సీనియారిటీలో ఓ ఫాదర్ లాంటి వ్యక్తి ఫంక్షన్‌కు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. బోయపాటి గురించి చెప్పాలంటే తన కెరీర్‌లో సాలిడ్ హిట్ ఇచ్చిన వ్యక్తి అని తెలిపాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని… సింహా, లెజెండ్ చూశారని.. ఇప్పుడు అఖండ మూవీ అన్‌స్టాపబుల్‌గా ఉంటుందని అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. ఇక అఖండ ట్రైలర్ తాను చూశానని.. ట్రైలర్ తనకు చాలా నచ్చిందని బన్నీ తెలిపాడు. బాలయ్య గారికి సినిమాలు అంటే అడిక్షన్ అని పేర్కొన్నాడు. బాలయ్య డైలాగ్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరని అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. బాలయ్య రెండు పేజీల డైలాగులు చెప్పినా… మూడు పేజీల డైలాగులు చెప్పినా చాలా కన్వీనెంట్‌గా చెప్తారని.. ఆయనలో అదే స్పెషల్ అని కొనియాడాడు. కోవిడ్ వచ్చినా… పైనుంచి దిగి దేవుడు వచ్చినా తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు తగ్గేదే లే అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. రెండో లాక్‌డౌన్ తర్వాత వస్తున్న అఖండ మూవీ సినీ రంగానికి అఖండ జ్యోతిలా వెలగాలని బన్నీ ఆకాంక్షించాడు.