విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు సినీనటుడు అక్కినేని నాగార్జున. జగన్‌తో భేటీలో ఏం మాట్లాడారోనని అంతటా ఉత్కంఠ రేగుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు నాగార్జున. విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతుంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్ తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. ఇండస్ట్రీ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు నాగార్జున. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయల్దేరారు సినీనటుడు అక్కినేని నాగార్జున.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో హీరో అక్కినేని నాగార్జున భేటీ అయినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వ్యక్తిగతమని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నాగార్జున తన వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశాయి.
ఏపీలో సినిమా రంగం, థియేటర్లలో సమస్యలు, ఆన్ లైన్ టికెటింగ్, ఆక్యుపెన్సీకి సంబంధించిన అనేక అంశాలు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున టాలీవుడ్ సమస్యల్ని సీఎంతో చర్చించి వుంటారని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో వాటిని కొట్టిపారేశారు నాగార్జున. కేవలం వ్యక్తిగత సంబంధాల కోసమే నాగార్జున-జగన్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.