తెలంగాణలో ఉప ఎన్నిక వేడి బాగా రాజుకుంది. మరో రెండురోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు.
ఆతర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. బలమైన స్థానంలో ఓటమి పాలయింది. దీంతో పతనం మొదలైపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే ఆవెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పట్టు నిలుపుకునేందుకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టీఆర్ఎస్ తన సత్తా చాటింది.
అంతా అయిపోయింది.. ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతోందని భావించిన సమయంలో అల్పపీడనంలా ఈటల రాజేందర్ ఎపిసోడ్ అలజడి రేపింది. ఈటల రాజీనామా, వెంట వెంటనే రాజీనామాకు ఆమోదం, ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో మళ్ళీ వేడి రాజుకుంది.
ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి కంటి మీద కనుకు లేకుండా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యావత్ తెలంగాణ ప్రభుత్వంలోని యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లో తిష్ట వేసింది. గత ఆరునెలలుగా హుజురాబాద్ కేంద్రంగా రాజకీయాలు సాగుతూనే వున్నాయి. దుబ్బాక, సాగర్ ఒక ఎత్తయితే.. హుజూరాబాద్ మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి మారిందనే చెప్పాలి.
మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో దళితులను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ దళిత బంధు తెచ్చింది. వివిధ కారణాల వల్ల ఆ పథకం ఆగినా, దాని తాలూకు ప్రకంపనలు ఇతర నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ నియోజకవర్గాల్లోనూ తమకు ఉప ఎన్నిక కావాలనే డిమాండ్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఒకే.. కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు మౌనంగా వుంటారు. కానీ బీజేపీ అభ్యర్ధి ఈటల గెలిస్తే మాత్రం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రేగుతాయని అంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకుని కొందరు ఉపఎన్నికకు వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఉప ఎన్నిక జరిగే ప్రాంతాలపై సీఎం కేసీఆర్ వరాలు, నిధుల వరద కురిపించడంతో తమ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు వస్తే బాగుండనని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే వైరల్ అవుతోంది. ఎన్నికలు వస్తేనే మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి.
అభివృద్ధి జరుగుతుందని జనం అభిప్రాయపడుతున్నారు. కొత్త పథకాలు తెరమీదకు రావాలన్నా, ఎన్నికల సందర్భంగా తమకు బిర్యానీ, డబ్బులు, ఇతర తాయిలాలు అందాలన్నా ఉప ఎన్నికే కావాలంటున్నారు. తమ ఎమ్మెల్యేనో ఎంపీనో తమ పదవికి రాజీనామా చేస్తే బాగుండేదని జనం అభిప్రాయపడడం, ఫ్లెక్సీలతో సందడి చేయడం నయా పాలిటిక్స్ కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఎమ్మెల్యేల ఫోటోలతో ఫ్లెక్సీలు అక్కడక్కడా దర్శనం ఇస్తున్నాయి. నియోజకవర్గంలో మీరు మా మీద ప్రేమతో రాజీనామా చేయండి. అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. మాకు కొత్త పథకాలు వస్తాయి. మా ఊళ్ళు బాగుపడతాయంటూ జనం డిమాండ్ చేస్తున్నారు.
ఇల్లందు, భువనగిరితో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎమ్మెల్యేలపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గోషామహల్ ఉప ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. గోషా మహల్ ప్రజల కోసం తన పదవిని త్యాగం చేస్తానంటున్నారు రాజాసింగ్. ఇలాంటి డిమాండ్లు మరింత పెరిగితే అధికార పార్టీకి, రాష్ట్ర ఖజానాకు ఇబ్బందులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీ అనుసరిస్తారో చూడాలి.