టైటానిక్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లేదు. హీలీవుడ్ నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇక, ఆ సినిమా హీరో డికాప్రియో బీటిల్ కట్ హెయిర్ స్టైల్ అప్పట్లో యమా ఫేమస్ అయింది. టైటానిక్ సినిమా వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అమలులో ఉన్నది. అప్పట్లో ఆ హెయిర్‌స్టైల్‌ను యువత బాగా లైక్ చేసింది. చాలా మంది యూత్ ఆ హెయిర్‌స్టైల్ చేయించుకోవడానికి బార్బర్ షాపులకు క్యూలు కట్టారు. అయితే, తాలిబన్ల పాలనలో షరియా చట్టాల ప్రకారం పాశ్చాత్యపోకడలను అనుసరించడం నేరం. అంతేకాదు, మగవాళ్లు జుట్టు, గడ్డాలు పెంచుకోవాలని వారి చట్టాలు చెబుతున్నాయి. బీటిల్ కట్‌తో కనిపించిన యువకులను తీసుకెళ్లి గుండ్లు కొట్టించేవారు. కానీ, లాభం లేకపోవడంతో బార్బర్ షాపులను మూయించారు. బార్బర్లను చితకబాదారు. తాలిబన్ల కాలంలో వేలాది బార్బర్ షాపులను మూసేశారు. అయితే, ఇప్పుడు మరోసారి తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఇక తమకు ఎలాంటి పని ఉండదని, షాపులు మూసేసి వేరే పనులు చూసుకోవాల్సిందేనని అంటున్నారు బార్బర్ షాపు యజమానులు. తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశిస్తున్నారని తెలిసిన వెంటనే యువత ఇంటి నుంచి బయటకు రాకుండా గడ్డాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.