దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఢిల్లీ, మహారాష్ట్రపై అధికంగా ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసుల వృద్ధి 86శాతంగా ఉంటే, మహారాష్ట్రలో 82శాతంగా ఉంది. ఇక, మహారాష్ట్రలో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం 252 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 945 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
Read: నిబంధనలు పాటించకుంటే… నియంత్రించడం కష్టం…
దేశంలో మొదటగా కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన వారం రోజుల వ్యవధిలోనే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో ఒక్కరోజులో 2510 కేసులు నమోదవ్వడంతో ఆందోళన మొదలైంది. దేశంలో మూడోవేవ్ మొదలైందని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించడం ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని నిపుణులు పేర్కొన్నారు.