‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని, మరీ ముఖ్యంగా ఆ సినిమాను ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే స్ట్రీమింగ్ చేయించాలని అనుకోవడాన్ని శుక్రవారం తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు థియేటర్ ఓనర్స్ ‘టక్ జగదీశ్’ హీరో నానిపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. అయితే…. శనివారం ఆ విషయమై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు కోరింది. ఎవరినీ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విమర్శించడం తమ అభిమతం కాదని తెలిపింది. కొంతమంది తమ ఆవేదనను కోపంతో అలా బయట పెట్టారని, దానిని మనసులో పెట్టుకోవదని, అలా ఎవరైనా ఆ మాటల వల్ల బాధ పడి ఉంటే క్షమించమని కోరింది.
నిజానికి ఓటీటీ ద్వారా సినిమాలను అక్టోబర్ వరకూ విడుదల చేయవద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరిన తర్వాతే రామానాయుడు స్టూడియోస్ అధినేత డి. సురేశ్ బాబు తన ‘నారప్ప’ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. అలానే ప్రముఖ కథానాయకుడు నితిన్ తండ్రి, సీనియర్ నిర్మాత సుధాకర్ రెడ్డి తమ చిత్రం ‘మాస్ట్రో’ను త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ పెద్ద నిర్మాతలైన వీరిద్దరిని ప్రశ్నించకుండా నాని సినిమా ‘టక్ జగదీశ్’ నిర్మాతలనే ఎగ్జిబిటర్స్ వేలెత్తి చూపించడం పట్ల సినిమా రంగానికే చెందిన కొందరు అసహనం వ్యక్తం చేశారు. పైగా ఒకే రోజున ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలైతే సమస్య కానీ… ఒకటి థియేటర్లలోనూ, మరొకటి ఓటీటీలోనూ విడుదలైతే ఇబ్బంది ఏమిటి? అని మరికొందరు ప్రశ్నించారు. ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ‘లవ్ స్టోరీ’కి పోటీగా ఎందుకు భావిస్తున్నారనీ మరి కొందరు అడుగుతున్నారు. పైగా పండగ సీజన్ లో రెండు మూడు సినిమాలు విడుదలైనా నష్టం ఉండదని నిర్మాతలే తరచూ చెబుతుంటారని, ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు, రెండు మాధ్యమాల ద్వారా వస్తే తప్పేమిటని నిలదీస్తున్నారు.
మొత్తం మీద సినిమా రంగం అంతా ఒకే కుటుంబమని, అందరి బాగు కోసం తాము మాట్లాడుతున్నామని, అమెజాన్ ప్రైమ్ లో ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని కాస్తంత ముందు లేదా కాస్తంత వెనకగా స్ట్రీమింగ్ చేసుకోమని మాత్రమే తామ కోరామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వివరణ ఇవ్వడం కొసమెరుపు.