దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇక ఇదిలా ఉంటే, తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తమిళనాడులో తాజాగా 33 కేసులు నిర్ధారణ జరిగినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనెల 15 వ తేదీన తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా, ఈరోజు మరో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 34 కేసులు నమోదయ్యాయి.
Read: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు…
ఇందులో చెన్నైలో 26 మందికి, మధురైలో నలుగురికి, తిరువణ్ణామలైలో ఇద్దరికి, సేలంలో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలను కఠినం చేశారు. రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, విమానాశ్రయంలో నిర్వహించే పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి కూడా నిరంతర పర్యవేక్షణలో ఉంచుతున్నట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.