కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్‌వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే కాదు.. వార్డులు, గ్రామాలు.. అంతెందుకు పంట పొలాల్లో తిరుగుతూ కూడా వ్యాక్సిన్లు వేశారు. అయినా, ఇంకా వ్యాక్సిన్లు వేసుకోనివారి సంఖ్య భారీగానే ఉంది.. మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయి.
Read Also: భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్..! తాజా హెచ్చరికలు
దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పార్లమెంట్‌లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23 కోట్లకు పైగానే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో ఒక్క డోసూ వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని.. బీహార్‌లో ఆ సంఖ్య 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కన్షార్షియం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరగా.. 94 దేశాలకు 7.23 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది భారత్. ఇక 150 దేశాలకు భారత్ నుంచి కోవిడ్ సంబంధింత మందులు, ఇతర సాయాన్ని అందించింది భారత్. ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో ప్రవేశంచడం.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేసుకోనివారు ముందు ఆ పని చేయండి అంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ సెంటర్లకు రావడంలేదు. దీంతో.. వారిలో అవగాహన కల్పించడంపై దృష్టిసారించింది సర్కార్.