భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ వ్యవహారంపై కామెంట్ చేయని పరిస్థితి.. అయితే, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను రద్దు చేసి.. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం.. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (ఢిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేయడాన్ని.. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు వ్యతిరేకించేవారూ లేకపోలేదు.. నేతలను సర్కార్ గృహ నిర్భంధం చేసి.. తీవ్రస్థాయిలో వారిని ప్రతిఘటించిందనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఆర్టికల్ 370ని రద్దు చేసి ఇవాళ్టికి రెండేళ్లు పూర్తి అయ్యింది.
దీని మూలంగా మంచి ఫలితాలు వచ్చాయి… తీవ్రవాద చర్యలు 60 శాతం తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.. రాళ్ల దాడులు 87 శాతం మేర తగ్గిపోగా.. పర్యాటక వ్యాపారం 20 నుంచి 25 శాతానికి తిరిగి పుంజుకుంది.. ఒక తీర్మానం, ఒక బిల్లుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ స్థితిలో చారిత్రక మార్పును లిఖించింది. పార్లమెంటులో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు, దానిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. దీంతో జన్‌సంఘ్ దీర్ఘకాల డిమాండ్ అయిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం పూర్తైంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370, 35A రద్దు చేయడంతో ఆ ప్రాంతం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అనంతరం కశ్మీర్‌లో కఠినమైన లాక్‌డౌన్ అమలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఆందోళనలకు తావిచ్చింది. ఎందరో నేతలను గృహ నిర్బంధంలో ఉంచి జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనేలా కృషిచేసింది మోడీ సర్కార్.. ఈ రెండేండ్లలో కశ్మీర్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. ఓవైపు కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించినప్పటికీ.. పర్యాటకుల సంఖ్య మాత్రం పెరుగూతేనే ఉంది.. దాల్ సరస్సులో చాలా మంది పర్యాటకులు బోటు షికారు చేస్తున్నారు. పర్యాటకులు 20 నుంచి 25 శాతం వరకు తిరిగి రావడంతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. దీని ఫలితంగా 20 శాతం మందికి ఉపాధి కూడా లభించింది..
ఆర్టికల్ రద్దు చేసి రెండేళ్లు అయిన సందర్భంగా భద్రత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ఎప్పటిలాగే సందడి నెలకొంది.. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద సీఆర్‌పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ రెండేండ్లలో వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు తిరిగొచ్చిందని డ్రై ఫ్రూట్ షాప్ నిర్వహకులు చెబుతున్నారు.. మరోవైపు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన ప్రత్యర్థులు ఒక్కటయ్యారు.. ఒకప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) మధ్య తీవ్రమైన పోటీ ఉండగా.. ఈ పరిణామాల తర్వాత చేతులు కలిపాయి.. ఇక, ఎన్సీపీ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీలతోపాటు పలువురు నేతలను 2019 ఆగస్టులో గృహ నిర్బంధంలో ఉంచి.. 2020లో విడుదల చేశారు.. జమ్మూ కాశ్మీర్‌కు ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఎజెండాగా పెట్టుకుని కలిసి ముందుకు నడుస్తున్నారు. కాగా, ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించిన పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.. జమ్మూ కాశ్మీర్ ప్రజలు శోకంలో ఉంటే, బీజేపీ మాత్రం సంబరాలు చేసుకోవడం దురదృష్టకరమైన విషయం అని మండిపడ్డారు.. శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని, అనాగరికంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఫ్తీ.. ఆక్రమిత ప్రాంతాలపై పాకిస్థాన్‌తో చర్చలు జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం నాటి బ్లాక్ డేలో జమ్మూ కాశ్మీర్‌కు కలిగిన నొప్పి, హింస, తిరుగుబాట్లను వర్ణించడానికి పదాలు లేదా చిత్రాలు సరిపోవని పేర్కొన్న ఆమె.. అణచివేత, తీవ్ర అన్యాయం జరిగినప్పుడు ఉనికి కోసం అడ్డుకోవడం తప్ప కశ్మీర్ ప్రజలకు వేరే మార్గం లేదంటూ ట్వీట్ చేశారు. మెజార్టీ ప్రజలు ఈ రోజు సంబరాలు జరుపుకుంటుండగా.. కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, నినాదాల హోరు మాత్రం లేకపోలేదు.