తొలిసారి సీఎం హోదాలో భద్రాద్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. ముత్యాల తలంబ్రాల సమర్పణ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీ రాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణోత్సవం రాష్ట్రవ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమాలలో భాగం. తిరుకల్యాణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకకు వెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ విధానాల ప్రకారం సన్నబియ్యం పొందుతున్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదల జీవన స్థితిగతులపై ప్రత్యక్ష అవగాహన పొందేందుకు ముఖ్యమంత్రి ఈ అడుగు వేస్తున్నారు.
హైదరాబాద్‌లో శ్రీరామనవిమి శోభాయాత్ర.. పూర్తి వివరాలు ఇవే..
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
మందుబాబులకు షాకింగ్.. నేడు వైన్ షాపులు బంద్!
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్…హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామ నవమి ర్యాలీలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కపడ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రెండవ అయోధ్యగా పేరుగాంచింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఉత్సవాలు 11 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రోజు ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి. ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ, ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించనున్నారు.
నేడు పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈరోజు (ఏప్రిల్ 6న) శ్రీ రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న మోడీ.. అనంతరం బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తైన పనులను ప్రారంభించనున్నారు. అలాగే, సభ ముగిసిన తర్వాత ప్రధాని రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల దగ్గర పూజలు చేయనున్నారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే, రామేశ్వరం- తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సుమారు 535 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రైల్వే బ్రిడ్జి మధ్య భాగంలో వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఓడలు, పడవలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జి నిటారుగా పైకి లిఫ్ట్ అయ్యెలా నిర్మాణం చేశారు. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రైల్వే బ్రిడ్జి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
సముద్రపు రొయ్యలపై పెద్దగా ప్రభావం చూపని ట్రంప్ ట్యాక్స్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్యాక్సులు సముద్రపు రొయ్యలపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్రౌన్ 400, టైగర్ 1000 – 1200, వైట్ రొయ్య 500 – 550 రూపాయల మధ్య ధర పలుకుతుంది. ఈనెల 14వ తేదీ నుంచి చేపల వేట నిషేధం అమలులోకి రానుంది. ఇండియన్ మెరైన్ ఇంపోర్టులపై మొదటి నుంచి యూఎస్ సర్కార్ ఆంక్షలు అమలు చేస్తుంది. అయితే, పర్యావరణ భద్రత, బాధ్యత అవలంబించడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈక్విడార్ నుంచి పెద్ద ఎత్తున రొయ్యలు, చేపలు దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిడిల్ ఈ స్ట్, యూరోపియన్ దేశాలకు భారీగా ఎగుమతులు అవుతున్నాయి.
రాజాసాబ్ ఈ ఏడాది లేనట్టే..?
ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి పోస్టర్స్, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే ఇప్పుడు రాజాసాబ్ కావాలి అనేలా చేశారు. ఇలాంటి సమయంలో రాజాసాబ్ రిలీజ్ చేస్తే అదిరిపోతుంది. మేకర్స్ కూడా ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్’ను రిలీజ్ చేస్తామని అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు రాజాసాబ్ సౌండే లేకుండా పోయింది. అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ప్రజెంట్ ఏం చేస్తున్నారనే వివరాలేవి చెప్పడం లేదు. ఇలాగే ఉంటే రాజాసాబ్ పై ఉన్న బజ్ కాస్త పోయేలా ఉంది. ఎలాగు సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారు.అయితే ఈ ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. రాజాసాబ్ ఇంకా సాంగ్స్ షూట్ ఉందని అవి ఫినిష్ అయ్యేసరికి చాలా టైమ్ పడుతుందని అసలు ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదని వినిపిస్తోంది. అభిమానుల సహనానికి పరీక్ష పెట్టేలా చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్ ఇప్పటికైనా అప్డేట్స్ ఇస్తాడేమో లేదో చూడాలి.
‘పుష్ప-3’లో ఇద్దరు స్టార్స్..ఇందులో నిజమెంత!
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క మూవీతో ఇటు అల్లు అర్జున్, రష్మిక మూవీ టీం అందరికీ మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటన ఇవ్వడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ కూడా ఈ చిత్ర కథను మరింత పవర్‌ఫుల్‌గా రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్ర పై సరికొత్త బజ్ వినిపిస్తోంది. ఎంటీ అంటే విలన్ పాత్ర కోసం ఈ సినిమాలో ఇద్దరిని యాకక్టర్స్‌ని పెట్టాలని ఆయన చూస్తున్నాడట. ఇంతకి ఎవరు అంటే దీనికోసం విజయ్ దేవరకొండ, నాని పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్‌గా ఉంటాడనే వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు నాని కూడా యాడ్ కావడంతో నిజంగానే సుకుమార్ ఇలాంటిది ప్లాన్ చేస్తున్నాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే మూవీ అభిమానులకు పూనకాలే..
చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు.. రిటైర్మెంట్‌పై ఊహాగానాలు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు శనివారం చెపాక్‌లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను వీక్షించారు. మహీ 2008 నుంచి చెన్నై ప్రాంచైజీ తరఫున ఆడుతుండగా.. అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్‌కు హాజరైన నేపథ్యంలో మహీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదని, ధోనీ ఆటలో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ‘ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రచారానికి తెరదించడం నా పని కాదు. నేను అతడితో కలిసి పని చేస్తున్నా. ధోనీ ఇంకా బలంగా ముందుకు సాగిపోతున్నాడు. ధోనీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి నాకు తెలియదు. అది నేను అడగలేను కూడా. ధోనీ భవిష్యత్తు గురించి మీరే అడగాలి. ప్రస్తుతానికి మహీతో పని చేయడాన్ని ఆస్వాదిస్తున్నా’ అని ఫ్లెమింగ్ చెప్పాడు.