నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది ఏపీ కేబినెట్. ఇక, రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. పథకాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
నేడు పోలీసుల ఎదుట విచారణకు మాజీ మంత్రి కాకాణి హాజరుపై సందిగ్ధం
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న (బుధవారం) మరోసారి హైదరాబాద్ లో కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈరోజు నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక, నేడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ మరియు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై పొదులుకూరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదు అయినా కేసులను కొట్టివేయాలని కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నేటికి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సెక్రటరీ తరఫున కొనసాగనున్న వాదనలు!
నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు కొనసాగనున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేయనుంది. బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్ల పాటు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. తమ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా.. స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేస్తోంది.
వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ పడడంతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలు ఎంపీలకు విప్ జారీ చేయడంతో సభ్యులు సభకు హాజరయ్యారు. ఇక గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. ఇక్కడ కూడా దాదాపు 8 గంటల పాటు చర్చ జరగనుంది. అధికార-ప్రతిపక్ష సభ్యులు మాట్లాడనున్నారు. ఇక్కడ బిల్లు ఆమోదం పొందుతుందో.. లేదో చూడాలి.
ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భారత్‌పై ఎంతంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్ అమెరికన్ల చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నా.. తాము మాత్రం సగమే విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాలపై ఉన్న ప్రేమతోనే సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండియాపై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని.. అయితే భారత్.. అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు.
‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కోసం వస్తున్న NTR
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథతో సంబంధం లేకుండా, ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముక్యంగా ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా.. యూత్ ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా మ్యాడ్ స్క్వేర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ మూవీ సక్సెస్ మీట్‌ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నాడట.