నేడు భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి (ఏప్రిల్ 14న) నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలను స్వీకరించే అవకాశం ఉంది.
మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు చేరుకోనున్నారు. జిల్లాలోని అధికారులతో పాటు సాధారణ ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం, ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక మంచిర్యాల చేరుకున్న మంత్రి వర్గం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడే ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా, ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంఘ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా.. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్షితిజ్ మరికొందరు పాల్గొన్నారు.
నేడు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ( ఏప్రిల్ 14న ) గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై భేటీ కానున్నారు. ఇక, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేడ్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. ఇక, సాంఘిక సంక్షేమ వసతి గృహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, అంబేడ్కర్ విద్యా పథకం కింద రుణాలు తీసుకుని చదువుకున్న స్టూడెంట్స్ తో వర్చువల్ సమావేశంలో సీఎం మాట్లాడనున్నారు.
అనకాపల్లిలో నేడు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం
అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురిని నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే, నర్సీపట్నంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఇక, అనకాపల్లిలో నేడు మరో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆరు బృందాల ఏర్పాటు చేశారు. పేలుడు సంభవించిన ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది.
బెంగాల్ దారిలో కర్ణాటక.. వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్‌లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని కోరారు. తమ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించిందని, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఏదైనా ఉంటే కేంద్రంతో తేల్చుకోవాలని ఆందోళనకారులకు తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే, బెంగాల్ దారిలో కర్ణాటక ప్రభుత్వం కూడా నడుస్తోంది. కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయదని చెప్పారు. ‘‘మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తమకు ఆమోదయోగ్యం కాదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందకూడదు కానీ, ఆమోదం పొందింది. మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. కర్ణాటకలో దీనిని అమలు చేయము’’ అని అన్నారు.
ఆర్థిక నిందితుడు “మెహుల్ చోక్సీ” బెల్జియంలో అరెస్ట్.!
ఆర్థిక నిందితుడు మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియంలో అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసి వేల కోట్లు అప్పుగా తీసుకుని, ఇండియా నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు 65 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. చోక్సీని అరెస్ట్ చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించారు. అయితే, అనారోగ్యం, ఇతర కారణాలు చూపుతూ చోక్సీ బెయిల్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 13,500 కోట్ల రుణ మోసంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీని భారత్ కోరుతోంది. ఆయన తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసి ఆంట్వెర్ప్ నివసిస్తున్నాడు. ఆంటిగ్వా అండ్ బార్బడోస్ దేశ పౌరసత్వాన్ని కలిగి చోక్సీ, తన వైద్యం కోసం ఆ దేశాన్ని వదిలిపెట్టాడు.
ట్రంప్‌ని చంపేందుకు ప్లాన్, పేరెంట్స్ హత్య.. ఎవరు ఈ నికితా కాసాప్..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్న 17 ఏళ్ల నికితా కాసాప్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రంప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పథకం ప్రకారం, తన తల్లిదండ్రుల్ని హత్య చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఇతడిని అరెస్ట్ చేశారు. విస్కాన్సిన్‌కి చెందిన నికితా కాసాప్ ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా కాసాప్(35), సవతి తండ్రి డొనాల్డ్ మేయర్(51)వారి ఇంట్లోనే కాల్చి చంపాడని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరిద్దరి శరీరాల్లో బుల్లెట్లు కనిపించాయి. కుళ్లిపోయిన శరీరాలతో నే కొన్ని రోజులు పాటు ఇతను ఉన్నాడు. ఆ తర్వాత 14,000 డాలర్ల నగదు పాస్‌పోర్టు, తన పెంపుడు కుక్కతో పారిపోయాడని వాకేషా కౌంటీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. గత నెలలో కాన్సాస్‌లో ఇతడిని అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు కావాల్సిన డబ్బు పొందేందుకు తన తల్లిదండ్రుల్ని హత్య చేసినట్లు విచారణలో తేలింది. కాసాప్ తన తల్లిదండ్రుల హత్యలకు ప్లాన్ చేశాడని, డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడని, రష్యన్ మాట్లాడే వ్యక్తితో సహా ఇతరులతో తన ప్రణాళికను పంచుకున్నాడని ఫెడరల్ అధికారులు భావిస్తున్నారు.
‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ డేట్ లాక్ ?
ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి 28న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్..లు హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ మూవీకి కొనసాగింపుగా రూపొందడంతో ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగా ముగ్గురు హీరోలు తమ టాలెంట్ తో మంచి టాక్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా లడ్డు యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ సక్సెస్ మీట్‌కి రావడం కూడా ఈ మూవీకి కొంత హెల్ప్ అయింది. ఇక ఈ చిత్రం థియేటర్స్‌లో రన్‌ని దాదాపు కంప్లీట్ చేసుకోవచ్చింది. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
KGF – 3లో తమిళ స్టార్ హీరో..?
కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘాన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సిరీస్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడు దానికి సీక్వెల్ KGF-3 రాబోతుందని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్నాడని, KGF సీరిస్ లో భాగంగా అజిత్ కుమార్ తో ప్రశాంత్ రెండు భాగాలను తెరకెక్కించబోతున్నాడని తమిళ మీడియా వార్తలు వండి వడ్డిస్తోంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది.