ఏపీలో హెచ్3ఎన్2 వైరస్..! మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..
ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్ పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామన్న ఆయన.. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గతంలో వచ్చి పోయినట్టు తెలిపారు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో ఎక్కువగా కన్పిస్తోందన్నారు.. ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం ఉంటుందని వెల్లడించారు.. గత కొన్నేళ్లుగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోంది. మొదటి మూడు, అయిదు రోజులు దగ్గర, జ్వరం వస్తుంది.. చిన్నారులు, వృద్దులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు. జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదైనట్టు తెలిపారు డాక్టర్ వినోద్ కుమార్.. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఈ వైరస్ సోకితే విద్యార్థులని స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇక, ఈ వైరస్ పై అనవసర అపోహలు వద్దు.. బయట నుంచి ఇంటికి రాగానే చేతులు తప్పనిసరిగా కడగడం మర్చిపోవద్దన్నారు.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ ద్వారా ఇన్ఫూయీంజా వ్యాపిస్తోందని.. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
రాయలసీమలో 30 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరు..!
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా లేరని వ్యాఖ్యానించారు.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి లో శాంతి నెలకొందన్న ఆయన.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో హత్యా రాజకీయాలు లేవన్నారు.. ఇక, జేసీ బ్రదర్స్‌పై విరుచుకుపడ్డ బైరెడ్డి.. జేసీ బ్రదర్స్ కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి..? అని ప్రశ్నించారు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? అంటూ ఎద్దేవా చేశారు.. తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్లుగా రాజరిక పాలన నడిపారన్న ఆయన.. ఇప్పుడు రాయలసీమలో 30 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేదని పేర్కొన్నారు.
రేపు బీజేపీ కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష
భారతీయ జనతా పార్టీ ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’పేరుతో మరో దీక్షకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడంతోపాటు గత 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మహిళలకు చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. దీంతోపాటు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మహిళా బిల్లు పేరుతో తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని మరోసారి యావత్ దేశానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మహిళా మోర్చా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి కొల్లి మాధవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మహిళా మోర్చా నేతల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష చేయాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతితోపాటు మహిళా మోర్చా రాష్ట్ర నాయకులంతా ఈ దీక్షలో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బీజేపీలోకి ప్రముఖ నటి, ఎంపీ సుమలత..! క్లారిటీ ఇచ్చిన సీఎం..
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజకీయ నాయకురాలిగా మారిన ప్రముఖ నటి, మాండ్యా లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీష్.. అధికార బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగుతోంది.. శుక్రవారం మండ్యలో జరిగే ప్రెస్ మీట్‌లో స్వతంత్ర ఎంపీ సుమలత బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె వద్ద బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి, అక్కడ మెగా బహిరంగ సభలో ప్రసంగించేందుకు మార్చి 12న ప్రధాని నరేంద్ర మోడీ మాండ్యాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనుందట.. మాండ్యాలో 1.5 కి.మీ మేర జరిగే రోడ్‌షోలో కూడా ప్రధాని పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ వ్యవహారంపై స్పందించారు.. చర్చలు కొనసాగుతున్నాయని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. కాగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న సుమలత.. మంచి పేరు తెచ్చుకున్నారు.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 2019 సాధారణ ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై ఏకంగా 1.25లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు సుమలత.. దీంతో.. ఒక్కసారిగా మాండ్య వైపు అందరి దృష్టి మళ్లింది.. అయితే, సుమలత భర్త, అంబరీశ్ గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఇక, గత ఎన్నికల్లో సుమలత కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించినా.. అది సాధ్యపడలేదు.. దీంతో.. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విక్టరీ కొట్టారు.. ఇప్పుడు బీజేపీ చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనవరిలో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం తర్వాత విమానయాన భద్రతపై తీవ్ర హెచ్చరికలు ఉన్న నేపాల్‌లో.. శ్రీ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఖాట్మండు నుండి నైరుతి నేపాల్‌లోని భైరహవాకు వెళ్లాల్సిన విమానంలో సిబ్బందితో సహా 78 మంది ఉన్నారు. కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలట్ నివేదించడంతో వెంటనే ఆ విమానాన్ని ఖాట్మండుకు మళ్లించినట్లు శ్రీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అనిల్ మనంధర్ చెప్పారు. ఖాట్మండులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. “అది ల్యాండ్ అయినప్పుడు ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించిన సూచనలు లేవు” అని నిరౌలా చెప్పారు. మౌంట్ ఎవరెస్ట్‌తో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో ఎనిమిదింటికి నిలయమైన పర్వత నేపాల్‌కు తరచుగా విమాన ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉంది. వాటిలో చాలా కష్టతరమైన భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పు కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జనవరిలో దేశ రాజధాని ఖాట్మండు నుంచి పొకారా వెళ్తుండగా.. ల్యాండింగ్ సమయంలో విమానం క్రాష్ అయ్యింది. ప్రమాదం జరిగిన విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యతీ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. నలుగురు రష్యా పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్ల ముందు విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లను సాధించినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.ఫెడరల్ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే ప్రావిన్స్ అసెంబ్లీల నుండి 518 మంది సభ్యులు తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాట్మండులోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్ పార్లమెంట్ భవనంలో ఓటింగ్ జరిగింది. నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ కు 214 మంది ఎంపీలు, 352 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఓటు వేశారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత అయిన రామచంద్ర పౌడెల్ .. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు రామచంద్ర పౌడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
రిలయన్స్ మరో కొత్త బిజినెస్.. పెప్సీ, కోకాకోలాకు చెక్..!
రిలయన్స్ మరో కొత్త బిజినెస్ ప్రారంభించింది.. ఒకప్పటి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను రీలాంచ్ చేసింది. ప్యూర్ డ్రింక్ గ్రూప్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్).. ఈ రోజు సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), FMCG విభాగం మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, 50 ఏళ్ల నాటి దిగ్గజ పానీయాల బ్రాండ్ కాంపాను ప్రారంభించినట్లు ప్రకటించింది. గతేడాది ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపాను రిలయన్స్ దాదాపు రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. కాంపా పోర్ట్‌ఫోలియోలో మొదట్లో కాంపా కోలా, కాంపా లెమన్ మరియు కాంపా ఆరెంజ్ పానీయాల ఉండేవి.. దీనిపై రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మాట్లాడుతూ.. ఈ బ్రాండ్‌ను ప్రారంభించడం.. స్వదేశీ భారతీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి.. కంపెనీ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఉందని.. ఇది గొప్ప వారసత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా, భారతీయ వినియోగదారులతో సుదీర్ఘమైన సంబంధాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నరాయి.. వేసవిలో కూల్ డ్రింక్స్‌కు ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ ఈ డ్రింక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ డ్రింక్స్ 200 ఎంఎల్, 500 ఎంఎల్, 600 ఎంఎల్, 1 లీటర్, 2 లీటర్‌ల ప్యాక్స్‌లు అందుబాటులో ఉంచనున్నారు.. 200 ఎంఎల్ బాటిల్ ధర 10 రూపాయలు కాగా.. 500 ఎంఎల్ బాటిల్ ధరను రూ.20గా నిర్ణయించింది కంపెనీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది.. కాంపాను కొత్త రూపంలో ప్రదర్శించడం ద్వారా, ఈ నిజమైన ఐకానిక్ బ్రాండ్‌ను స్వీకరించడానికి మరియు పానీయాల విభాగంలో కొత్త ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి.. తరతరాలుగా ఉన్న వినియోగదారులను ప్రేరేపించాలని మేం ఆశిస్తున్నాం. పాత కుటుంబ సభ్యులు ఒరిజినల్ కాంపా యొక్క మధురమైన జ్ఞాపకాలను కలిగి ఉంటారని.. బ్రాండ్‌తో అనుబంధించబడిన నాస్టాల్జియాను ఆదరిస్తారని.. కొత్త వినియోగదారులు స్పష్టమైన రిఫ్రెష్ రుచిని ఇష్టపడతారని.. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌లో కాంపాను తిరిగి తీసుకురావడానికి మేం నిజంగా సంతోషిస్తున్నాం.. ఇది మా విస్తరిస్తున్న వ్యాపారానికి మరో సాహసోపేతమైన ముందడుగా పేర్కొంది రిలయన్స్..
తారక్, బన్నీ, చరణ్ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే..
ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. డ్యాన్స్ తోనే కాదు నటనతోనూ ఆమె ప్రేక్షకులను కట్టి పడేసింది. గ్లాంనర్ తోనే కాదు కళ్ళతో కూడా అభిమానులను కట్టిపడేయొచ్చు అని చెప్పిన నటీమణుల లిస్టులోకి చేరిపోయింది. లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకొని అందుకు తగ్గట్లుగానే ఎణ్హతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో ముందుకు సాగుతోంది. ఇక గార్గి సినిమా తరువాత సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ ను ఓకే చేసింది లేదు. ప్రస్తుతం ఒక కోలీవుడ్ సినిమా మాత్రమే సాయి పల్లవి చేతిలో ఉంది. సాధారణంగా చాలా రేర్ గా ఆమె ఇంటర్వూస్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత షో లో సందడి చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమో నిమిషం పాటే ఉన్నా ఆసక్తిని రేకెత్తించింది. స్మిత అడిగిన రెండు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆన్సర్ లు ఇచ్చి ఔరా అనిపించింది. టాలీవుడ్ స్టార్ హీరోలు బన్నీ, తారక్, చరణ్ లతో ఎవరితో డ్యాన్స్ చేయాలని ఉంది అంటే.. ఆ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే బావుంటుంది అని నవ్వేసింది. ఇక రెండో ప్రశ్నగా మీటూ ఉద్యమం గురించి స్మిత అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి మాట్లాడుతూ.. “మీటూ అంటే కేవలం చేతులతో చేసేది మాత్రమే కాదు.. ఒక వ్యక్తిని మాటలతో వేధించినా కూడా అది అబ్యూసే అవుతోంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్న ప్రోమోతోనే ఎపిసోడ్ మొత్తంపై ఆసక్తిని పెంచేసింది స్మిత. మరి పూర్తి ఎపిసోడ్ లో స్మిత, సాయి పల్లవి దగ్గరనుంచి ఎన్ని నిజాలు రాబట్టిందో చూడాలంటే కొద్దీ సమయం వేచి చూడాల్సిందే.
బాలయ్య కూతురు రంగంలోకి దిగేసింది
నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయంతో మంచి జోరు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ జోరు మీదనే మరో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో NBK 108 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిసున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందని టాక్. ఇక ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నాడని తెలిసిందే. అంతేకాదు.. బాలయ్యకు కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని ఇప్పటికే మేకర్స్ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా శ్రీలీల ను సెట్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. బాలయ్య చేతిని పట్టుకొని ఉన్న శ్రీలీల ఫోటోను షేర్ చేస్తూ NBK 108 లోకి స్వాగతం అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించనున్నాడట అనిల్ రావిపూడి. అనిల్ అంటేనే కామెడీ.. ఆయన మార్క్ కు తగ్గట్టే కామెడీ కూడా ఉండనున్నదట. దీంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.