ఏపీకి కొత్త సీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. అదే రోజు అంటే రేపు సాయంత్రం జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన పదవి కాలనీ పొడిగించింది.. మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. ఆయన రిటైర్మెంట్ తప్పనిపరిస్థితి ఏర్పడింది.. దీంతో, ఆయన స్థానంలో కేఎస్ జవహర్ రెడ్డి ఛీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఏపీలో కీలక ఐఏఎస్‌ల బదిలీ..
ఏపీలో కీలక ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.. ఇక, సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్‌ను.. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా, ఐఏఎస్‌ల బదిలీ ప్రక్రియ ఎప్పుడూ సాగుతుంటే ప్రక్రియే అయినా.. ఈ సారి కీలక అధికారులు బదిలీ అయ్యారు..
ఎన్నికల విధులకు ఇక టీచర్లు దూరం
ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. కొత్త సవరణల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లభించింది.. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు.. దీంతో, వాటిపై ఫోకస్ పెట్టిన సర్కార్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సవరణ చేస్తున్నట్టు పేర్కొంది.. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రూల్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
మల్లారెడ్డి కేసులో రెండో రోజు ఐటీ విచారణ..
మంత్రి మల్లారెడ్డిపై సోదాల కేసులో ఐటీశాఖ విచారణ రెండో రోజు ముగిసింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి రేపు మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐటీ అధికారులు ఇద్దరికీ నమూనా పత్రాలు ఇచ్చారు. నిర్దేశించిన సమాచారాన్ని సమర్పించాలంటూ అదాయపు పన్ను శాఖ అధికారులు సూచించారు. ఇవాళ ఐటీ అధికారుల ఎదుట తొమ్మిది మంది హాజరయ్యారు. మల్లారెడ్డి ఆడిటర్ సీతారామయ్య సహా కళాశాలకు చెందిన సిబ్బందిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల అకౌంటెంట్లను ఐటీ అధికారులు ప్రశ్నించారు. సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, నగదు, హార్డ్ డిస్క్‌లకు సంబంధించిన విషయాలపై ఈ రోజు హాజరైన వారిని ప్రశ్నించారు. విద్యా సంస్థలకు చెందిన ఆదాయ వ్యయాలతో పాటు పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త..
తెలంగాణలో వరుసగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అయితే, నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న ఆయన.. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మెన్ జనార్దన్ రెడ్డితో కలసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఉద్యోగుల నియామక ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తుందని తెలిపారు.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని.. సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్..
వైఎస్ వల్లే వందలాది మంది ఆత్మహత్యలు..
మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అయిందని అన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడతా అని కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేశారంటూ విమర్శించారు. రాజశేఖర్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నాను. తెలంగాణ విషయంపై అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. తెలంగాణ ఇస్తామని.. కాలయాపన చేస్తూ, మాట దాటివేస్తూ, తెలంగాణ పదం ఎత్తకపోవడం వల్ల, తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీని వీడతా అని సోనియాగాంధీకి అల్టిమేటం ఇవ్వడం వల్ల తెలంగాణ ఆలస్యం అయిందని అన్నారు.
క్రెడిట్ కార్డుపై 68 లీటర్ల పెట్రోల్ ఉచితం..
ఇండియన్ ఆయిల్‌తో సిటీ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది.. ఇండియన్ ఆయిల్ సిటీ పేరుతో క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది.. దీనినే ఫ్యూయల్ క్రెడిట్ కార్డు అని కూడా పిలుస్తారు.. అయితే, ఈ క్రెడిట్ కార్డుతో 68 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఎలా పొందవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీల ద్వారా వచ్చే రివార్డ్స్, టర్బో పాయింట్లు.. 68 లీటర్ల పెట్రోల్ ధరకు సమానమని చెబుతోంది సిటీ బ్యాంక్.. అంటే, ఉదాహరణకు ఈ కార్డుపై ఇండియన్ ఆయిల్ పెట్రో బంక్‌ల్లో రూ.150తో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే 4 టర్బో పాయింట్స్ లభిస్తాయి.. ఇక గ్రాసరీ స్టోర్స్‌లో, సూపర్ మార్కెట్లలో రూ.150పై చేసే లావాదేవీలపై 2 టర్బో పాయింట్స్ పొందవచ్చు.. ఇలా పొందిన టర్బో పాయింట్లతో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవచ్చు.. అంటే.. ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం.. కావును.. ఆ పాయింట్లపైనే ఫ్యూయల్ పొందవచ్చు.. మరోవైపు, ఇండియన్ ఆయిల్ పంపుల్లో ఒక శాతం ఇంధన సర్ ఛార్జీ మినహాయింపు కూడా పొందవచ్చు అని చెబుతోంది సిటీ బ్యాంక్.. ఇలా ఒక్క ఏడాదిలో వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు చమురు పొందే అవకాశం ఉందని చెబుతోంది సిటీ బ్యాంక్.
డిజిటల్ రూపీ
రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్‌బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రిటైల్ డిజిటర్ రూపాయి కూడా కాగితం కరెన్సీ, నాణేలా లాగే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. రూ.2000, రూ. 500, రూ. 200, రూ.100 ఇలా డిజిటల్ రూపాయి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూర్, భువనేశ్వర్ నగరాల్లో మొదటి దశను ప్రారంభించనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి బ్యాంకులు మొదటి విడతలో సేవలను అందిచనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు రెండో విడతలో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాల్లో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నాయి.
రెండో పెళ్లిపై మీన క్లారిటీ..
టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా.. ఆ బాధను మర్చిపోవడానికి వెంటనే షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే, రెండు రోజుల నుంచి మీనా రెండో పెళ్లి చేసుకొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ వార్తలను ఖండించింది. “బుద్ధి ఉందా.. డబ్బు కోసం ఏదైనా చేస్తారా..? ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను.. సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. నిజ నిజాలు తెలుసుకొని రాయండి.. దిగజారి ప్రవర్తించకండి.. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియా లో ఎన్నో తప్పుడు ప్రచారాలు వచ్చాయి.. అవి ఇప్పటికి ఆగలేదు.. ఇలాంటి వార్తలు పుట్టించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను” అంటూ నిప్పులు చెరిగింది.
గ్రూప్ శృంగారం.. ప్రాణం తీసింది..
బీహార్‌లోని నలందా జిల్లాలోని ఒక గ్రామంలో పిను దేవీ అనే 30 ఏళ్ళ మహిళా వితంతువు టీ కొట్టు పెట్టుకొని జీవిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆ టీ కొట్టు వద్ద ఆమెకు కృష్ణనందన్ ప్రసాద్ (75) సూర్యమణి కుమార్ (60) వాసుదేవ్ పాశ్వాన్ (63) లోహా సింగ్ (62) అనే వృద్దులు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వృద్దులు నలుగురు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. అది కూడా ఎలా అంటే ఒక్కొక్కసారి ఒకొక్కరు కాకుండా సామూహంగా ఒకేసారి ఆమెతో రాసలీలలు సాగించేవారు. కొన్నిరోజులు అంతా బాగానే నడించింది. ఆ తరువాత ఆమెపైన తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. ఆమె కూడా కాదనకుండా ఐదోవాడితో కూడా శృంగారంలో పాల్గొంది. కానీ, వారిద్దరూ కలిసి ఉండడం మిగతా నలుగురికి ఇష్టం లేదు. ఈ విషయమై నలుగురు ప్రియులు, ఐదో వాడితో గొడవపడ్డారు. మహిళ వద్దకు వచ్చిన తృపిత్ శర్మ.. ఇక నుంచి తనతో మాత్రమే ఉండాలని, ఆ నలుగురితో కనిపిస్తే మీ బండారం బయటపెడతాను అని బెదిరించాడు. ఇక ఎక్కడ వారు బయటపడతారో అని మహిళ, నలుగురు ప్రియులు కలిసి తృపిత్ ను హత్య చేయాలనీ నిర్ణయించుకున్నారు. శృంగారానికి అని పిలిచి అతడిని రాళ్లతో కొట్టి చంపి టాయిలెట్ ట్యాంక్ లో పడేశారు.
బూతు బొమ్మల మాటున నిజాలు దాచేస్తోంది..!
కోవిడ్, లాక్ డౌన్ ను భరించలేని చైనా ప్రజలు ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. తమకు ఫ్రీడమ్ కావాలంటూ ఉద్యమాలు చేపట్టారు. ఇక ఈ ఉద్యమాలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా, మీడియాలో ఎక్కడా రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుందట. అంతేకాకుండా ఈ విషయం బయటకు పొక్కకుండా ఒక దిగజారిన నిర్ణయం తీసుకున్నారట. గూగుల్ కు వెళ్లి ఎవరైనా చైనా నిరసనలు, చైనా కోవిడ్ ఉద్యమం అని సెర్చ్ చేస్తే… ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా ఆ ప్లేస్ లో బూతు బొమ్మలను వచ్చేలా ఫిక్స్ చేశారట. మోడల్స్, అసభ్యకరమైన వెబ్ సైట్లు ఓపెన్ అవుతున్నాయట. అంతే అక్కుండా సోషల్ మీడియాలో నిరసన, బీజింగ్, అల్లర్లు అనే పదాలు రాకుండా వాటిని బ్లాక్ చేశారట. ఇక మరింత ఎదురుతిరిగిన యువకులను ఆ కేసులు, ఈ కేసులు పెట్టి వారిని జైల్లో పెడుతున్నారట. మరి చైనా ఆగడాలు ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.